సాగునీటి కోసం ఉద్యమించాలి

Movement For Irrigation System - Sakshi

కృష్ణానది నీళ్లు ఉమ్మడి పాలమూరు  జిల్లా ప్రజల జన్మహక్కు 

హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలి 

సామాజిక వేత్త, సీనియర్‌ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్‌ 

భూత్పూర్‌ (దేవరకద్ర) : తెలంగాణ ప్రజలు సాగు, తాగునీటి కోసం ఉద్యమించాలని సామాజికవేత్త, సీనియర్‌ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్‌ అన్నారు. కృష్ణా– సావిత్రి నదుల పరిక్రమ సైకిల్‌ యాత్రను విజయవంతంగా పూర్తిచేసి భూత్పూర్‌ వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కృష్ణానది నీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల జన్మహక్కు అన్నారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల పరిపాలన సౌలభ్యం కోసం రెండో రాజధానితోపాటు ఉప పార్లమెంట్, ఉప రాజ్యసభ, ఇతర కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరుతూ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 6 వేల కి.మీ. సైకిల్‌యాత్ర చేపట్టానన్నారు. కృష్ణానది పుష్కరాల సందర్భంగా సైకిల్‌యాత్ర ప్రారంభించానని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో పరిపాలన జరగాలని, ప్రాంతీయ విభేదాలతో రెండు రాష్ట్రాలుగా  విడిపోయిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, నియామకాలు, నీళ్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. తాను కర్ణాటక, మహారాష్ట్రలో సైకిల్‌యాత్ర చేపడితే సైకిల్‌పై ఉన్న తెలుగు భాషతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర భాషల్లో బోర్డు రాసే వరకు తనను ఆయా రాష్ట్రాల్లో సైకిల్‌ యాత్ర చేపట్టనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంకల్పన యాత్ర యావత్‌ ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా జరుగుతుందని, ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటాలు చేయడం సరైందేనన్నారు. అనంతరం ఆయన శ్రీశైలానికి సైకిల్‌పై బయలుదేరి వెళ్లారు.  
జడ్చర్లలో ఘన స్వాగతం..
జడ్చర్ల టౌన్‌ : పైరుపచ్చని తెలంగాణ సాధన, తెలుగును పరిపాలన భాషగా అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు గౌరీశంకర్‌ చేపట్టిన సైకిల్‌ యాత్ర శుక్రవారం జడ్చర్లకు చేరుకుంది. జడ్చర్ల ఫ్‌లైఓవర్‌ వద్ద సీఐ బాలరాజు ఆయనకు స్వాగతం పలికారు.  పైరు పచ్చని తెలంగాణ రాష్ట్ర సాధననే తన యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. నదుల అనుసంధానం ద్వారానే పైరుపచ్చని తెలంగాణ సాధ్యమని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అందుకోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాటుపడాలన్నారు. అలాగే హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలని, తద్వారా దక్షిణ భారతదేశానికి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, జర్నలిస్టులకు జీతభత్యాలను ప్రభుత్వాలే ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్‌ కార్డులను అందరికీ ఇవ్వాలని, పత్రికా రంగం విడిచిన వారికి పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. తన లక్ష్యాలు పూర్తయ్యే వరకు సైకిల్‌ యాత్ర కొనసాగిస్తానన్నారు. జడ్చర్ల నుంచి కర్నూలు, ఆత్మకూర్, శ్రీశైలం మీదుగా కల్వకుర్తి, హైదరాబాద్‌ వరకు ప్రస్తుత యాత్ర ముగిస్తానని ఆయన పేర్కొనన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top