కడసారి చూపు కోసం..

More Dead Bodies Found In East godavari Boat Capsizes - Sakshi

కచ్చులూరులో బయటపడిన బోటు

38 రోజుల తర్వాత వెలుగులోకి మృతదేహాలు

కడిపికొండ వాసులు ముగ్గురి ఆచూకీ కోసం ఎదురుచూపులు

సాక్షి, కాజీపేట(వరంగల్‌) : పాపికొండలు విహారయాత్రకు వెళ్లి బోటు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన కడిపికొండ వాసులు ముగ్గురి కుటుంబీకులు తమ వారి మృతదేహాలనైనా చివరిసారి చూసుకుంటామా, లేదా అనే ఆందోళనలో ఇంతకాలం గడిపారు. తాజాగా మంగళవారం బోటును వెలికితీయడం, అందులో ఏడు మృతదేహాలు లభించడంతో తమ వారు, ఉన్నారా లేదా అనే సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితికి చేరుకోవడంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున కుటుంబ సభ్యులు రావాలని అక్కడి అధికారులు సమాచారం ఇవ్వడంతో రాజమండ్రికి బయలుదేరారు. 

సుదీర్ఘ నిరీక్షణ
గత నెల 14వ తేదీన పాపికొండలు విహార యాత్రకు కడిపికొండ వాసులు 14 మందితో పాటు న్యూశాయంపేటకు చెందిన ఒకరు వేర్వేరుగా వెళ్లారు. వీరు యాత్రకు ఎంచుకున్న వశిష్ట బోటు 15వ తేదీన గోదావరిలో ప్రమాదానికి గురై మునిగిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు సురక్షితంగా బయటపడా.. ఆ తర్వాత ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక కొండూరి రాజ్‌కుమార్, కొమ్ముల రవి, బస్కే ధర్మరాజు ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఎప్పుడు.. ఏ రోజు.. ఏం సమాచారం అందుతుందోనని రోదిస్తూ గడిపారు. తాజాగా మంగళవారం బోటును వెలికితీయడం.. అందులో ఏడు మృతదేహాలు బయటపడడంతో తమ వారి మృతదేహాలు ఉన్నాయా అని ఆరా తీశారు. 

తల లేని మృతదేహం
గత కొద్ది రోజులుగా కచ్చులూరులో బోటు వెలికితీత పనులు చేపడుతుండగా గత ఆదివారం తల లేని మొండెంతో కూడిన మృతదేహం బయటపడింది. ఈ మృతదేహం ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతుండగానే మంగళవారం మరో ఏడు మృతదేహాలు లభించాయి. ఇందులో ఐదుగురు పురుషులు, ఓ చిన్నారి ఉండగా.. మరో మృతదేహం ఎవరిదనేది తేలలేదు. ఇక 38 రోజులుగా నీటిలో నానడంతో మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితికి చేరగా.. గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలకు రావాలని వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ముగ్గురి కుటుంబ సభ్యులు రాజమండ్రికి మంగళవారం సాయంత్రం బయలుదేరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top