వ్యభిచార ఊబి!

Molestation links from yadagirigutta to siddipeta - Sakshi

యాదగిరిగుట్ట నుంచి సిద్దిపేటకు లింకు

జిల్లాలోనూ వ్యభిచార గృహాల్లో పలువురు బాలికలు ఉన్నట్టు అనుమానం

సాక్షి, సిద్దిపేట/మెదక్‌: అభం శుభం తెలియని చిన్నారులను అపహరించి.. వ్యభిచార ముఠాలకు అప్పగించడం, వారిని పెద్దచేసి వ్యభిచార ఊబిలోకి దింపడం లాంటి ఘటనలు యాదగిరిగుట్టలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బాలికల అపహరణ ముఠాల మూలాలు వెలికి తీస్తున్న రాష్ట్ర ప్రత్యేక పోలీసు బృందాలకు పలు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సిద్దిపేటతో పాటు జిల్లాలోని కొడకండ్ల (రాంచంద్రాపూర్‌)లో కూడా అపహరించిన ఆడపిల్లలను వ్యభిచార ఊబిలోకి దింపినట్టు సమాచారం. ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర పోలీసు ప్రత్యేక బృందాలు సిద్దిపేట జిల్లాపైనా నిఘా పెంచినట్టు తెలిసింది.

ఇతర ప్రాంతాలతోనూ లింకులు..
సిద్దిపేట పట్టణం, జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో పోలీసుల దాడుల్లో వ్యభిచార ముఠాలు పట్టుబడినప్పుడు కొంతకాలం మిన్నకుండిపోయి ఆపై యథావిధిగా తమ పనులు సాగించడం పరిపాటిగా మారింది. అనేక ఏళ్లుగా పలు కుటుంబాలు ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయి. అయితే, స్థానికులే కాకుండా ఈ వ్యభిచార గృహాలకు నెల, రెండునెలలకు ఒకసారి ఇతర ప్రాంతాల అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

సిద్దిపేట, కొడకండ్లలోని వ్యభిచార గృహాల నిర్వాహకులకు యాదగిరిగుట్ట, రామాయంపేట, వంగపాడు, గీసుగొండ ప్రాంతాలు, ఏపీలోని చిలకలూరిపేట, పెద్దాపురం వంటి ప్రాంతాల వ్యభిచార రాకెట్లతోనూ సంబంధాలున్నట్టు సమాచారం. ఈ సంబంధాలతో వ్యభిచార గృహాలలో ఉండే అమ్మాయిలను ఇక్కడి వారిని అక్కడికి పంపడం.. అక్కడివారిని ఇక్కడికి తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అపహరించిన పిల్లలను సిద్దిపేటలో కూడా పెంచి పెద్ద చేస్తున్నట్టు సమాచారం. కాగా, యాదగిరిగుట్టలో పిల్లల సంఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఎప్పుడూ సందడిగా ఉండే సిద్దిపేటలోని కోమటిచెరువు సమీపంలోని వ్యభిచార గృహాలతో పాటు కొడ కండ్ల సమీపంలోని రాంచంద్రాపురం గృహాల వద్ద కొద్ది రోజులుగా స్తబ్ధత నెలకొంది.  

సిద్దిపేట జిల్లాలోనూ పిల్లలు..  
సిద్దిపేట జిల్లాలో కూడా పలు ప్రాంతాలలో వ్యభిచార గృహాల నిర్వాహకులవద్ద 5 నుంచి 10 సంవత్సరాల వయసున్న చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. యాదగిరి గుట్టలో వెలుగు చూసిన సంఘటనతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు గుట్టలో పట్టుకున్న వారిని విచారించిన సందర్భంగా ఈ విషయం బయటపడినట్టు సమాచారం. దీంతో ప్రత్యేక బృందాలు సిద్దిపేట జిల్లాపైనా నిఘా పెంచినట్లు తెలిసింది.

జప్తిశివనూరుపై నిఘా
యాదగిరిగుట్టలో చిన్నారులను వ్యభిచార కూపంలోకి దించుతున్న ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో మెదక్‌ జిల్లా నార్సింగి మండలంలోని జప్తిశివనూరు (సరోజీనగర్‌)పై పోలీసులు దృష్టిపెట్టారు. గతంలో ఇక్కడ గుట్ట తరహా సంఘటనలు చోటు చేసుకున్న దృష్ట్యా మరోమారు అందరి దృష్టి జప్తిశివనూరుపై పడింది. తాజాగా ఇక్కడా చిన్నారులేమైనా ఉన్నారా.. అన్న అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు రహస్యంగా విచారణ సాగిస్తున్నట్టు సమాచారం.

జప్తిశివనూరులో వ్యభిచార గృహాలకు యాదగిరిగుట్ట, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఏపీ నుంచి కూడా యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించేవారు. మైనర్‌ పిల్లలతో వ్యభిచారం చేయించిన సంఘటనలపై గతంలో పలు కేసులు నమోదు చేశారు. గత ఏడాది మార్చిలో పోలీసుల ప్రత్యేక బృందం రాత్రి వేళ ఆకస్మికంగా జప్తిశివనూరులోని పలు గృహాలపై దాడులు చేసింది. అప్పట్లో 50 మందికిపైగా యువతులను అదుపులోకి తీసుకుని స్టేట్‌ హోమ్‌కు తరలించారు. ఈ దాడుల అనంతరం జప్తిశివనూరు వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టారు. దీంతో వ్యభిచారం కొంతవరకు సద్దుమణిగింది.

తాజాగా గుట్టలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు జరిపిన విచారణలో జప్తిశివనూరు విషయం కూడా బయటపడినట్లు తెలుస్తోంది. అక్కడ దాడులు నిర్వహించిన అధికారులు జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఎస్పీ చందనాదీప్తి స్పందిస్తూ జప్తిశివనూరుతోపాటు అనుమానం ఉన్న అన్ని ప్రాంతాలపై నిఘా వేసినట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top