
కడ్తాల్ (కల్వకుర్తి): మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అడవిలో దాదాపు కిలోమీటర్ దూరం నడిచారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని ఎక్వాయిపల్లికి చెందిన రైతు పుట్టి యాదయ్య పొలంలోని పాకలో కట్టేసిన లేగదూడపై ఆదివారం ఉదయం చిరుత దాడి చేసి చంపింది.
అనంతరం దానిని సమీపంలోని అడవిలోకి దాదాపు కిలోమీటరు దూరం వరకు లాకెళ్లింది. లేగదూడపై చిరుత దాడి విషయం తెలుసుకున్న నారాయణరెడ్డి ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకొని రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం లేగదూడను చిరుత లాక్కెళ్లిన స్థలం వరకు అడవిలో సుమారు కిలోమీటర్ దూరం రైతులతో నడుచుకుంటూ వెళ్లి లేగదూడ కళేబరాన్ని పరిశీలించారు. చిరుతను వెంటనే బంధించాలని అధికారులను కోరారు. ఎమ్మెల్సీతోపాటు సర్పంచ్ సుగుణసాయిలు, ఎంపీటీసీ ఉమావతి తదితరులు ఉన్నారు.