మోదం..ఖేదం

Mixed Response From Nalgonda People On Central Budget - Sakshi

ముద్ర లోన్ల ద్వారా ఎస్‌హెచ్‌జీలకు ఏటా రూ.283.35 కోట్ల లబ్ధి

5 ఎకరాల లోపున్న రైతులకు ఏటా రూ.6వేల సాయం

ఉద్యోగులకు ఒకింత ఊరట

సాక్షి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్‌ కొన్ని వర్గాల్లో ఆశలు నింపగా మరికొందరికి నిరాశను మిగిల్చింది.  కేంద్ర బడ్జెట్‌లో పెట్రోలు, డీజిల్‌పై ఒక రూపాయి సుంకం పెంచుతున్నట్లు ప్రకటించిన వెంటనే లీటరు పెట్రోల్‌పై రూ.2.50, లీటరు డీజిల్‌పై రూ.2.60 ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రతినెలా జిల్లాపై రూ.112కోట్ల అదనపు భారం పడనుంది. కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రెండు సీజన్లకు కలిపి రూ.6వేల ఆర్ధిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. తాజా బడ్జెట్‌లో రైతులకు ప్రత్యేక ప్రకటనలు ఏమీ లేకున్నా.. రూ.6వేల సాగు సాయాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.

జిల్లా వ్యాప్తంగా 4.41లక్షల మంది రైతులు ఉండగా, అయిదు ఎకరాల లోపు పంట భూములున్న రైతులు 4.25లక్షల మందిదాకా ఉంటారని జిల్లా వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే 90శాతానికి పైగా రైతులు అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న వారే. దీంతో కేంద్రం నుంచి ప్రతిఏటా రూ.255కోట్ల మేర ఆర్థిక సాయం పెట్టుబడుల కోసం అందనుంది. 

మహిళా సంఘాలకు మేలు మేలు
జిల్లా వ్యాప్తంగా 28,335 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 3,11,685 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో ఎస్‌హెచ్‌జీల్లోని ఒక మహిళకు రూ.ఒక లక్ష చొప్పున ముద్ర రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.283.35 కోట్ల మేర రుణాలు అందనున్నాయి. అంతే కాకుండా.. ఒక్కో గ్రూప్‌లోని ఒక్కో మహిళకు జన్‌ధన్‌ ఖాతాతోపాటు బ్యాంకులో రూ.5వేల చొప్పున ఓవర్‌ డ్రాఫ్ట్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఫలితంగా రూ.156కోట్ల మేర సంఘాలు, మహిళలు లబ్ధి పొందనున్నారు. 

ఉద్యోగులకు ఊరట
కేంద్ర బడ్జెట్‌ సగటు ఉద్యోగిపైనా కరుణ చూపించినట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి నాటి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితిని రూ.5లక్షలుగా ప్రకటించింది. ఈ పరిమితిని తాజా బడ్జెట్‌లో పెంచకున్నా.. పాత పరిమితినే కొనసాగించనుండడంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వార్షిక వేతనంలో ఇతర మినహాయింపులు, సేవింగ్స్‌ మినహాయించే రూ.5లక్షల సీలింగ్‌ పెట్టింది. ఇది కనీసం రూ.6లక్షలపైచిలుకు వార్షిక వేతనానికి పన్ను మినహాయింపు లభించినట్టేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.  జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు రమారమి 20వేల మంది ఉండగా, వీరిలో రూ.5లక్షల వేతనం పొందే వారు దాదాపు 5వేల మంది దాకా ఉంటారని అంచనా. ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో వీరందరికీ లబ్ధి చేకూరినట్లేనని పేర్కొంటున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top