ఇంటర్‌ ఇంగ్లిష్‌–2 పరీక్షలో తప్పులు | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఇంగ్లిష్‌–2 పరీక్షలో తప్పులు

Published Sun, Mar 8 2020 4:43 AM

Mistakes Occurred In Intermediate English Paper 2 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్‌ పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయి. మొత్తం 6 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్లు విద్యార్థులు గుర్తించారు. వాటివల్ల పరీక్ష కేంద్రాల్లో  గందరగోళానికి గురి కావాల్సి వచ్చిందని అనేక మంది విద్యార్థులు వాపోయారు. 5, 7, 10, 12, 14, 17 నంబరు ప్రశ్నల్లో తప్పులు దొర్లాయని, దీంతో 15 మార్కుల వరకు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిలో 14వ ప్రశ్నను అసంపూర్తిగా ఇవ్వగా.. మిగతా ప్రశ్నల్లోనూ అనేక తప్పులు దొర్లాయి. ప్రశ్నపత్రం ప్రింట్‌ చేసిన తరువాత ప్రూఫ్‌ రీడింగ్‌ చేయకపోవడం, తప్పులను సరిదిద్దడంలో నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని లెక్చరర్లు పేర్కొంటున్నారు. అయితే ఈ తప్పులకు బాధ్యత బోర్డుదే అయినందున విద్యార్థులు నష్టపోకుండా మార్కులు కలపాలని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీష్‌ డిమాండ్‌ చేశారు.

ఆ ప్రశ్న అటెంప్ట్‌ చేస్తే మార్కులిస్తాం: బోర్డు కార్యదర్శి 
ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులపై ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ స్పందించారు. 14వ ప్రశ్న అసంపూర్తిగా ఉన్నందున ఆ ప్రశ్నను అటెంప్ట్‌ చేసిన విద్యార్థులకు 4 మార్కులు ఇస్తామని వెల్లడించారు. అచ్చు తప్పుల విషయంలో ఉదయం 9:45 గంటలకే అన్ని పరీక్ష కేంద్రాలకు సమాచారం ఇచ్చి సరి చేయించామన్నారు. తప్పులతో ప్రశ్నపత్రాలను రూపొందించిన వారిపై చర్యలు చేపడతామన్నారు.

ఇవీ ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులు.. 
►14వ ప్రశ్నలో ఎస్‌బీఐ సేవింగ్స్‌ అకౌంట్‌ ఫారం ఇచ్చారు. అందులో అకౌంట్‌ నంబరు, పేరు, అమౌంట్‌ ఇచ్చారు. అయితే అందులో డేట్, బ్రాంచి వివరాలు, మొబైల్‌ నంబరు ఆప్షన్, సంతకం లేకుండా అసంపూర్ణంగా ప్రశ్నను ఇచ్చారు. ఆ తరువాత బోర్డు నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇన్విజిలేటర్లు అది కోఠి బ్రాంచ్‌ అని చెప్పారు. దీంతో విద్యార్థులు మరింత గందరగోళానికి గురయ్యారు. ఇది 4 మార్కుల ప్రశ్న కాగా, జవాబులు రాయాల్సిన ఖాళీలు 10 ఇచ్చారు. కానీ ప్రశ్నకు పక్కన మాత్రం 8 రాయాలని, ఒక్కో ఖాళీ నింపితే అర మార్కు చొప్పున ఇస్తామని ఉంది.  
►ఇక 4 మార్కులు కలిగిన 5వ ప్రశ్నకు  why అని ఉండాల్సిన చోట  What అని వచ్చింది.  
►4 మార్కులు కలిగిన 17వ ప్రశ్నలో  felicitationకి బదులుగా  felicilation అని తప్పుగా పడింది. 
►7వ ప్రశ్న రెండో పేరాలో  discipline అని ఇవ్వడానికి బదులుగా  disipline అని ఇచ్చారు. అదే తప్పు రిపీట్‌ కూడా అయ్యింది. 
►10వ ప్రశ్నలో a book అనే పదం ఉండాల్సి ఉండగా.. అది లేకుండానే ఇచ్చారు.  
►ఒక మార్కు కలిగిన 12వ ప్రశ్నలో turn a deaf ear అని ముద్రించాల్సి ఉండగా..turn a deaf year అని ముద్రించారు.

Advertisement
Advertisement