ఇంటర్‌ ఫలితాల్లో కొన్ని తప్పులు దొర్లాయి..

mistakes in bubbling the OMR sheets, says Inter Board Secretary Janardhan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో తప్పులు దొర్లాయని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి అంగీకరించారు. ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నివేదికను శనివారం ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికపై విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇంటర్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాలు బాగున్నా, వాటి అమలులో ఫెయిల్‌ అయ్యారు. ఫలితాలు వెల్లడి చేయడంలో కొన్ని తప్పులు జరిగాయి. రిజల్ట్స్‌ వచ్చిన రెండు, మూడు గంటల్లోనే తప్పు జరిగిందని బోర్డు దృష్టికి వచ్చింది. కోడింగ్‌ సరిగా జరగకపోవడం వల్లే విద్యార్థుల హాజరు విషయంలో పొరపాట్లు జరిగాయి. ఓఎమ్మార్‌ షీట్లలో బబ్లింగ్‌ చేసే సమయంలో కూడా కొన్ని మానవ తప్పిదాలు జరిగాయి. ఫలితాల ముందు డేటా అనాలసిస్‌ చేసి ఉంటే బాగుండేది. సర్వర్‌ సామర్థ్యం పెంచమని త్రిసభ్య కమిటీ సూచించింది.

ఇక గ్లోబరినా ఏజెన్సీకి ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. విద్యార్థుల ఆందోళనకు కారణమైనవారిపై చర్యలు తీసుకుంటాం. 531 మంది జాగ్రఫీ విద్యార్థుల మెమోలో ప్రాక్టికల్స్‌ మార్కులు కనిపించలేదు. చివరి నిమిషంలో సెంటర్‌ మార్పుల వల్ల కొన్ని తప్పులు జరిగాయి. ఉత్తీర్ణత శాతంలో తేడాలు లేవని కమిటీ గుర్తించింది. ఫెయిల్‌ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయాలని ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. సాఫ్ట్‌వేర్‌ లోపాలు ఉండటంతో కోడింగ్‌, డీ కోడింగ్‌ సమస్యలు వచ్చాయి. గతంలో కూడా ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలు దొర్లాయి. వాటిని సరిచేసాం. ఈ తప్పులు ఊహించనవి కాదు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి జరిగాయి. ఫెయిల్‌ అయని విద్యార్థులకు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ సదుపాయం ఉచితంగా ఇస్తాం. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా ఇకపై మానవ తప్పిదాలు లేకుండా చూసుకుంటాం. అందరి సందేహాలు తొలగించేందుకు కమిటీ తెలిపిన ఆరు సూచనలను అమలు చేస్తాం.’ అని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top