భగీరథ పైపులు బుగ్గిపాలు

Mission Bagiratha Pipelines Blast In Fire Accident - Sakshi

రూ.20లక్షల విలువ చేసే పైపులు దగ్ధం 

ప్రమాదమా..? ఎవరైనా నిప్పు పెట్టారా?

రామకృష్ణాపూర్‌(చెన్నూర్‌): రామకృష్ణాపూర్‌లో మంగళవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మిషన్‌ భగీరథ పైపులు బూడిదయ్యాయి. పట్టణంలోని బీజోన్‌ ఆర్‌కే4 గడ్డ ప్రాంతంలో గల ఆట స్థలంలో మిషన్‌ భగీరథ పనుల కోసం పైపులు నిల్వ ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ప్రేంకుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేశారు. మంచిర్యాల, బెల్లంపల్లి ఫైర్‌ సిబ్బందితో పాటు సింగరేణి రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు పెద్ద ఎత్తున పొగలు కమ్ముతూ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో సమీపంలోకి వెళ్లడానికి ఫైర్‌ సిబ్బంది ఇబ్బందిపడ్డారు.

నీళ్లు సరిపోక పోవడంతో సమీపంలోని సీఎస్పీకి వెళ్లి ఫైర్‌ ఇంజన్లలో నీరు నింపుకుని వచ్చారు. అప్పటికే మంటలు మరింత ఉధృతమయ్యాయి. సింగరేణి రెస్క్యూ స్టేషన్‌ సభ్యులు మంటలు వ్యాప్తి చెందకుండా తక్షణమే నివారించే అక్వైర్డ్‌ ఫిల్మ్‌ ఫామ్డ్‌ ఫోమ్‌ను నీటితో పాటు సమాంతరంగా వినియోగించడంతో కొంతమేరకు మంటలు అదుపులోకి వచ్చాయి. సమీపంలోనే ఉన్న మిగతా పైపులను సర్పంచ్‌ జాడి శ్రీనివాస్, జెడ్పీటీసీ సుదర్శన్‌గౌడ్, ఓసీ డాట్‌ కంపెనీ మేనేజర్‌ సత్యనారాయణ, వార్డు సభ్యులు శశి, సత్యనారాయణ, రాజు, లక్ష్మారెడ్డి తదితరులు స్థానిక యువకులతో కలిసి దూరంగా తరలించారు. ఈ ఘటనతో స్థానికులు హడలిపోయారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే సమీపంలోని ఇండ్లకు మంటలు వ్యాపించి పెనుప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన చెందారు.

ఇంత నిర్లక్ష్యమా..?
రూ.కోటికి పైగా విలువ చేసే మిషన్‌ భగీరథ పైపులను ఎలాంటి భద్రత కల్పించకుండా ఆట స్థలంలో ఉంచడం, వాటిపై నిర్లక్ష్యం కనబర్చడం గమనార్హం. మంటలు చుట్టు పక్కల ప్రాంతంలోని ఇండ్లపైకి వ్యాపించి ఉంటే ఎవర బాధ్యత వహించేవారని స్థానికులు మండిపడ్డారు. ఇప్పటికైనా పైపులను సరైన చోట భద్రపర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

నిప్పు పెట్టి ఉంటారు : ఎస్‌ఈ ప్రకాశ్‌రావు
సంఘటన స్థలాన్ని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ప్రకాశ్‌రావు ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగి ఉంటుందని తాము భావించటం లేదని, ఎవరో నిప్పు పెట్టి ఉంటారనే భావిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సరైన గోడౌన్లు లేని కారణంగానే పైపులను భద్రతపర్చడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈఈ శ్రీనివాస్, డీఈలు విద్యాసాగర్, అబ్రహాం, రమణారావు తదితరులు ఘటనా స్థలిని సందర్శించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top