
రాష్ట్రానికి టీటీడీ రూ.241 కోట్లు బకాయిలు
దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. టీటీడీ నుంచి రాష్ట్రానికి రూ.241 కోట్లు రావాల్సి ఉందని ఆయన తెలిపారు.
హైదరాబాద్ : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. టీటీడీ నుంచి రాష్ట్రానికి రూ.241 కోట్లు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో దేవాదాయ శాఖకు నిధుల మంజూరు అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు...సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
విభజన చట్టం అనుసరించి దేవాదాయ శాఖ నిధులు ఇరు రాష్ట్రాలకు పంచాలన్నారు. టీటీడీ నుంచి రావాల్సిన బకాయిలను రాబడతామని హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని, రాబోయే బడ్జెట్లో ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు.
అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రూ.25 లక్షల ఆదాయం వచ్చే ఆలయాలు తక్కువగా ఉన్నాయన్నారు. అర్చకులకు జీతాలు సరిగా ఇవ్వటం లేదని, ధూప, దీప, నైవేద్యాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.