మేం ఎప్పుడూ ప్రజల పక్షమే

Minister Harish Rao Says We Work For People - Sakshi

నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: నాడు తెలంగాణ ఉద్యమంలో.. తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో.. తాము ప్రజల మధ్యనే ఉన్నామని, ఇక ముందు కూడా ప్రజల పక్షానే ఉంటామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు సేవ చేసే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటేనని పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా సీఎం కేసీఆర్‌ పాలన సాగుతోంద న్నారు.  రాష్ట్రం విద్యుత్‌ సమస్యను అధిగమించిందని, ఈ రంగంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చామని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సంపన్నంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి, ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చారని కొనియాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశామని తెలిపారు. దశాబ్ద కాలం నుండి రేషన్‌ డీలర్లు చాలీచాలని కమీషన్లతో ఇబ్బందులు పడుతుంటే సానుకూల దృష్టితో ఆలోచించి కమీషన్‌ పెంచామని వెల్లడించారు. ఇలా ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల అండదండలే టీఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు.  ప్రజల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికలు వచ్చినప్పుడే వారిపై మమకారం కలుగుతుందని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా కూడా చైతన్యవంతులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఇతర నేతలు పాల్గొన్నారు.

కాళేశ్వరం మోటారు డ్రైరన్‌ విజయవంతం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజీ–6 నంది మేడారం పంపుహౌజ్‌లో మోటారు డ్రైరన్‌ను ఇంజనీర్లు శుక్రవారం విజయవంతంగా పూర్తిచేశారు. 125 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న తొలి మోటారు డ్రైరన్‌ను అధికారులు తాజాగా చేపట్టారు. దేశంలోనే సాగునీటి రంగంలో ప్రథమ గ్యాస్‌ ఇన్సులేట్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్‌) విధానంలో అండర్‌గ్రౌండ్‌లో సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజనీర్లను అభినందించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top