రికార్డు స్థాయిలో ఉపాధి | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో ఉపాధి

Published Sun, May 10 2020 3:08 AM

MGNREGA In Telangana Number of Laborers Reaches 23 Lakhs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సృష్టించిన విధ్వంసం బడుగు జీవులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై.. పొట్ట చేత పట్టుకొని పట్టణ బాట పట్టిన వలస జీవులు తిరిగి పల్లెలకు తిరిగివచ్చేలా చేసింది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రిటైల్‌ తదితర రంగాలు కుదేలు కావడంతో ఉపాధి కోల్పో యి సొంతూరుకు చేరుకున్న సామాన్యులకు ‘ఉపాధి హామీ’లభించింది. చేతినిండా పని కల్పించింది. వ్యవసాయ పనులు ముగింపు దశకు చేరుకోవడం, లాక్‌డౌన్‌ కారణంగా మిగతా పనులు బంద్‌ కావడంతో ఉపాధి పనులకు డిమాండ్‌ పెరిగింది.
(చదవండి:సహజీవనం చేయాల్సిందే)

రికార్డు స్థాయిలో..
ఉపాధి హామీ పనులు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి 16 లక్షల మంది కూలీలు పనిచేయగా.. ఈసారి ఏకంగా 23 లక్షల మంది పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో కొన్నాళ్లు పనులకు బ్రేక్‌ పడినా గత నెలాఖరు నుంచి జోరందుకున్నాయి. కరోనా నేపథ్యంలో మార్చి నెలాఖరులో కేంద్రం ఉపాధి హామీలను తాత్కాలికంగా నిలిపేసింది. గుంపులు గుంపులుగా పనిచేసే వీలుండటంతో వైరస్‌ ప్రబలే అవకాశముందని భావించిన కేంద్రం.. కొన్నాళ్లు ఆపేసింది. 

ఆ తర్వాత ఉపాధి పనుల నిర్వహణకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడమే కాకుండా కూలి మొత్తాన్ని కూడా పెంచింది. రోజువారీ కూలిని వివిధ అలవెన్స్‌తో కలిపి రూ.237 చేసింది. తొలుత కరోనా భయంతో పనులు చేసేందుకు కూలీలు వెనుకడుగు వేశారు. ఈ నేపథ్యంలోనే గత నెల మొదటివారంలో పనులకు వచ్చే కూలీల సంఖ్య 10 వేలు కూడా దాటలేదు. అయితే పంచాయతీ కార్యదర్శులు, మేట్లు అవగాహన కల్పించడం, జాగ్రత్తలు తీసుకోవడంతో క్రమేణా కూలీల సంఖ్య పెరిగింది. 

వ్యవసాయ పనులు చివరి దశకు చేరడం, లాక్‌డౌన్‌తో ఇతర పనులన్నీ బంద్‌ కావడంతో గ్రామాల్లోని కూలీలు ఉపాధి పనుల బాట పట్టారు. దీంతో పక్షం రోజుల క్రితం 12.51 లక్షలున్న కూలీల సంఖ్య.. తాజాగా 23 లక్షలకు చేరువైంది. గ్రామాల్లో జాబ్‌ కార్డుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇన్నాళ్లూ వలస వెళ్లిన గ్రామీణులు తిరిగి రావడం.. ఉపాధి పనులు చేసేందుకు ముందుకు వస్తుండటంతో ప్రభుత్వం కొత్త జాబ్‌ కార్డులు జారీ చేస్తోంది.
(చదవండి: ఇక పరీక్షల్లేకుండానే..!)

Advertisement
Advertisement