‘బయ్యారం’పై గవర్నర్‌కు వినతిపత్రం

Memorandum to the Governor about Bayyaram steel factory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విభజన చట్టంలోని హామీలను అనుసరించి ప్రభుత్వపరంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని మంజూరు చేయాలని అఖిలపక్ష నేతలు బుధవారం గవర్నర్‌ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. బయ్యారంలోని లక్షా 54 వేల ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్న ఇనుప ఖనిజాన్ని రక్షణ స్టీల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసిన సందర్భంలోనే ప్రైవేటు కంపెనీలకు ఇవ్వొద్దని, వారికిచ్చిన లీజును రద్దు చేయాలని ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో సీపీఐ డిమాండ్‌ చేస్తే అన్ని పార్టీలు బలపరచాయని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు కింద నాటి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపునకు గురవుతున్నందున ఖమ్మం జిల్లాకు ఉక్కు పరిశ్రమను ఇస్తామని చట్టంలో చేర్చిందని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని చెప్పడం విభజన హామీలను తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర ప్రజల ఆకాంక్షగా కేంద్రానికి తెలియజేయాలని కోరారు. గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎల్‌.రమణ (టీటీడీపీ), ఎం.కోదండరాం (టీజేఎస్‌), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (టీపీసీసీ), కె.దిలీప్‌కుమార్‌ (టీజేఎస్‌), దొమ్మాటి వెంకటేశ్వర్లు (తెలంగాణ ఇంటి పార్టీ), కె.రవిచంద్ర (తెలంగాణ ప్రజాఫ్రంట్‌), జె.జానకీరాములు (ఆర్‌ఎస్‌పీ), సాదినేని వెంకటేశ్వర్‌రావు (సీపీఐ ఎంఎల్‌), భూతం వీరన్న (సీసీఐ ఎంఎల్‌) తదితరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top