‘పునాదిరాళ్ల’కు పుట్టెడు కష్టం

Megastar Chiranjeevi First Movie Director Suffering With Illness - Sakshi

అనారోగ్యంతో బాధపడుతున్న మెగాస్టార్‌ తొలిచిత్ర దర్శకుడు  

ఆపన్నహస్తం కోసంఎదురుచూస్తున్న రాజ్‌కుమార్‌  

నిర్మాతగా,దర్శకుడిగా, గీత, కథా రచయితగా ప్రస్థానం  

బంజారాహిల్స్‌: గూడపాటి రాజ్‌కుమార్‌ (75).. మెగాస్టార్‌ చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు. తొలి సినిమాతోనే 5 నంది అవార్డులు అందుకొని ఘనత సాధించారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా అవన్నీ సామాజిక ఇతివృత్తాలే. సామాజిక కోణంలో నిర్మించిన ఆ చిత్రాలతో ఎక్కడికో ఎదగాల్సిన ఆయనకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ముందుకెళ్లే స్థోమత లేక వెనకబడ్డారు. ఎదిగొచ్చిన కొడుకు అనారోగ్యంతో మృతి చెందడం, తర్వాత కొద్ది రోజులకే సతీమణిని కూడా కోల్పోవడం ఆయనకు కోలుకోలేని దెబ్బ. వెనక్కి తిరిగి చూసుకుంటే మెగాస్టార్‌తో మొదటి సినిమాతీశానన్న సంతోషం మాత్రమే మిగలగా... ముందుకు చూసుకుంటే భవిష్యత్తు చీకటిమయమై బతుకు అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంచానికి పరిమితమై వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, గీత రచయితగా, కథా రచయితగా పని చేసినా ఇప్పటికీ ఫిల్మ్‌నగర్‌లో గానీ, చిత్రపురి కాలనీలో గానీ ఆయనకు సొంతిల్లు లేదు. దీంతో అద్దె ఇంటిలోనే కాలం గడుపుతున్నారు. పైసా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లేకపోవడంతో రెండో కొడుకు కష్టంతో బతుకు వెళ్లదీస్తున్నారు. 

కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన రాజ్‌కుమార్‌ విజయవాడలో డిగ్రీ పూర్తి చేసి 1966లో హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొంది రెండేళ్ల పాటు నారాయణగూడ కేశవ మెమోరియల్‌ స్కూల్‌లో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే సినిమాలపై ఇష్టం పెరిగింది. మంచి ఇతివృత్తాలతో సినిమా తీస్తే బాగుంటుందని భావించారు. కాలేజీ చదివే రోజుల్లోనే నాటకాలు వేస్తూ పాటలు కూడా పాడేవారు. ఆ అనుభవాన్ని సినిమాల్లో రంగరించాలనుకున్నారు. పాతబస్తీ జహనుమాలోనా సదరన్‌ మూవీస్‌ స్టూడియోలోకి అడుగుపెట్టారు. తన ఆశయాన్ని నిర్వాహకులతో చెప్పారు. సతీ అనసూయ, రహస్యం సినిమాలకు కో–డైరెక్టర్‌గా పని చేశారు. ఆ స్టూడియోలో మరాఠీ, హిందీ సినిమాల షూటింగ్‌లు జరుగుతుండేవి. రాజ్‌కుమార్‌ ఆసక్తిని గమనించిన ఆ సినిమాల దర్శకులు కో–డైరెక్టర్‌గా అవకాశమిచ్చారు. అక్కడి నుంచి రాజ్‌కుమార్‌కు సినిమాలపై నమ్మకం పెరిగింది. తన అనుభవంతో ‘పునాదిరాళ్లు’ అనే సినిమాకు కథ రాసుకున్నారు. 1977లో ఈ సినిమా కథ రాసుకోగా, 1978లో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. 

ఆస్తులన్నీ సినిమాలకే...  

తండ్రితో విషయం చెప్పగా ఆస్తులు, పొలాలు అమ్మి ఆయన కొంత డబ్బు సమకూర్చారు. ఇంకేముంది మద్రాసు రైలెక్కారు. ఆ సినిమాలో ఐదుగురు హీరోలుండగా చిరంజీవి, సుధాకర్‌తో పాటు నరసింహరాజును తీసుకున్నారు. సినిమా నిర్మాణం అద్భుతంగా జరిగింది. ట్రయల్స్‌ చూసినా చాలామంది దర్శకులు విడుదల కాకముందే అభినందించారు. ఆ సినిమా విడుదల కోసం ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎంతోమందిని బతిమిలాడారు. ఓ వైపు రీరికార్డింగ్‌ పనులు జరుగుతుండగా, అక్కడకు వచ్చిన క్రాంతికుమార్‌కు చిరంజీవి అభినయం బాగా నచ్చి ఎవరితను అని రాజ్‌కుమార్‌ను అడిగారు. మంచి నటన ఉందని రాజ్‌కుమార్‌ చెప్పగా ‘ప్రాణం ఖరీదు’ సినిమాకు హీరోగా పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాజ్‌కుమార్‌ ఎలాగోలా సినిమా రిలీజ్‌ చేయగా 5 నంది అవార్డులు వచ్చాయి. ‘ఈ సమాజం నాకొద్దు, మన ఊరి గాంధీ, మా సిరిమల్లె’ తదితర ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించారు. కొద్దిరోజులు టీవీ సీరియళ్లకు కూడా పని చేశారు. ఎంత చేసినా ఆర్థికంగా ఎదగలేకపోయారు. సినిమాలకే ఆస్తులను ఖర్చు పెట్టారు. రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన రక్తపు విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. వైద్య ఖర్చులు భరించలేక శక్తిహీనుడయ్యారు. ఇప్పటికే గుండెకు రెండు స్టంట్‌లు వేశారని వాపోయారు.

చిరు స్ఫూర్తి..   
‘బావగారు బాగున్నారా’ సినిమా చేస్తున్న సమయంలో చిరంజీవి నన్ను పిలిపించి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఎవరైనా సినీ పెద్దలు ఆదుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను 70754 42277 నంబర్‌లో సంప్రదించొచ్చు.          – రాజ్‌కుమార్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top