‘నకిలీ’పై ఉక్కుపాదం

Medak Police Attack On Fake Seeds Company - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ: కోట్లాది ప్రజల కడుపు నింపే రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఎస్పీ చందనాదీప్తి అన్నారు. నకిలీ విత్తనాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేలను నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానమని, పంటలు పండించడమే తప్ప వాటిని లాభనష్టాలతో బేరీజు వేసే నైజానికి వారు దూరమన్నారు. తొలకరి జల్లులు పడగానే కోటి ఆశలతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని ఈ రోజు మన నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే అదంతా రైతు కష్టమేనన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతు బాగుండాలని, దేశానికి అన్నం పెట్టే వారే రైతులన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కారణంగా రైతు కంట కన్నీరు తప్ప వారికి ఆనందం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేదం చిందించి సేద్యం చేసి పచ్చని పంట పండించే రైతన్న నేడు నకిలీ విత్తనాలతో మోసానికి గురవుతున్నాడన్నారు. రైతులేని దేశాన్ని ఉహించలేమని, అందుకే రైతును కాపాడుకుంటేనే దేశం సస్యశ్యామలమవుతుందన్నారు.

రైతులను మోసం చేస్తే చర్యలు
ఇకపై రైతులను మోసాలు చేసేవారిపై కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాను శాశ్వతంగా అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నడుంబిగించిందని తెలిపారు. రైతులు తీసుకున్న విత్తనాలను నిజమైనవా, నకిలీవా? అని గుర్తించే విధానం గురించి, నకిలీ విత్తనాలను అమ్ముతున్న దళారుల మీద, కంపెనీలపై కేసులు నమోదు చేసే విధానం గురించి, నకిలీ విత్తనాలపై రైడింగ్‌చేసే విధానంపై పోలీసు అధికారులకు వివరించారు. ఆ కేసులకు సంబంధించి కోర్టులో చార్జ్‌షీట్‌ వేసే విధానంపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో చర్చించి వారి సహాయ సహకారాలతో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫర్టిలైజర్‌ షాపు యజమానులు తమ దుకాణాల్లో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించరాదని, అలా అమ్మితే యజమానులపై చట్టపరైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top