గంతేసి.. కోడ్‌దూకి..!

MCC Cases Filed on Political Parties Telangana - Sakshi

వందకుపైనే ‘ఎంసీసీ’ కేసులు నమోదు ∙  

నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 112

అత్యధికంగా టీఆర్‌ఎస్‌పై 37 కేసులు  ∙

28తో రెండో స్థానంలో మిత్రపక్షం ఎంఐఎం

ప్రతిరోజూ ఈసీకి నివేదిక అందజేస్తున్న పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సంఘం, రిటర్నింగ్‌ ఆఫీసర్లు, పోలీసులు.. ఎవరేం చెప్పినా డోంట్‌ కేర్‌ అన్నట్లు ఉంది రాజకీయ పార్టీల పరిస్థితి. ఎవరికి వారు ‘వీలున్నంత వరకు’ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ (ఎంసీసీ)ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. నగరంలో ఈ కేసుల సంఖ్య ఇప్పటికే సెంచరీ దాటింది. మొత్తం నమోదైన 112 కేసుల్లో అత్యధికంగా అధికార పార్టీపైనే నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో దాని మిత్రపక్షం ఎంఐఎం ఉంది. ఈ కేసులకు సంబంధించి సిటీ పోలీసులు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదికలు సమర్పిస్తున్నారు.   

ఈ తరహా కేసులే ఎక్కువగా..
ఉల్లంఘనకు సంబంధించి నమోదవుతున్నవాటిలో ఎంసీసీ కేసులే  ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా అనుమతి లేని ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్స్, లాలీపాప్స్‌తో ప్రచారం, నిషేధిత డ్రోన్‌ కెమెరాల వాడకం, వ్యక్తిగత దూషణలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, పలు సంస్థల ఛైర్మన్లతో పాటు ప్రభుత్వం నుంచి వేతనం, గౌరవ వేతనం పొందుతున్న వారు ఎంసీసీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అధికారిక వాహనాలను పార్టీ ప్రచారానికి వాడారనే ఆరోపణలపైనా కొన్ని కేసులు నమోదయ్యాయి. పాదయాత్రలు, వాహనర్యాలీలను నిర్వహించడానికి సంబంధించీ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించిన నోటీసుల జారీ, చార్జ్‌షీట్ల దాఖలు తదితర చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. నిర్ణీత సమయాన్ని మించి రోడ్‌ షోలు, సభలు, సమావేశాల నిర్వహణకు సంబంధించీ కేసులు ఉన్నాయి.  

సామాజిక మాధ్యమాలు, ‘సీ–విజిల్‌’ ద్వారా..
ఈ కేసుల్లో పోలీసులు ప్రత్యక్షంగా నమోదు చేసినవే ఎక్కువగా ఉన్నాయి. సోషల్‌ మీడియాలో వచ్చే ఫిర్యాదులను అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్న అధికారులు ప్రాథమిక నిర్ధారణ తర్వాత కేసులు నమోదు చేస్తున్నారు. నగరానికి సంబంధించి ఉత్తర మండల పరిధిలోనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అధికారిక యాప్‌ ‘సీ–విజిల్‌’ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణం స్పందిస్తున్నారు. వీటితో పాటు మద్యం, నగదు తరలింపు, పంపిణీలకు సంబంధించి, ప్రలోభాలకుయత్నించడం ఆరోపణల పైనా కేసులు నమోదు చేస్తున్నారు.

కేసుల వివరాలు ఇవీ..
మొత్తం కేసులు    è    112  
టీఆర్‌ఎస్‌           è    37
ఎంఐఎం            è    28  
కాంగ్రెస్‌              è    17
బీజేపీ                 è    13
టీడీపీ                 è      4
సీపీఎం              è    1
ఇతరులు           è    12

సైబరాబాద్‌ పరిధిలో..
నాన్‌బెయిలబుల్‌ వారెంట్స్‌– 2,389
ఆయుధాలు డిపాజిట్‌ చేసింది– 1,081
బైండోవర్‌: 1,696
మొత్తం కేసులు: 28
ఎక్సైజ్‌ కేసులు: 48
నగదు స్వాధీనం: రూ.1.83 కోట్లు  

రాచకొండ పరిధిలో..
నాన్‌బెయిలెబుల్‌ వారెంట్స్‌ –1,760
ఆయుధాలు డిపాజిట్‌ చేసింది– 751
బైండోవర్‌: 1,674
మొత్తం కేసులు: 36
రూ.90,837 విలువచేసే 289.90 లీటర్ల మద్యం
స్వాధీనం. నగదు స్వాధీనం: రూ.2.13 కోట్లు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top