మణుగురులో గుబాలించిన గులాబీ

Manuguru TRS Activists Meeting  - Sakshi

ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు 

మొదటిసారి మణుగూరు కోల్‌బెల్ట్‌కు వచ్చిన కేసీఆర్‌  

సాక్షి, మణుగూరుటౌన్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మణుగూరులో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభకు విచ్చేశారు. కేసీఆర్‌ సభ దృష్ట్యా మణుగూరు గులాబీమయమయింది. సీటైప్‌ సంతోష్‌నగర్‌ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభకు 12 గంటలకే సభాప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి సుమారుగా 25 వేల మంది జనం తరలివచ్చారు. షెడ్యూల్‌ ప్రకారం మణుగూరులో సీఎం కేసీఆర్‌ సభ 1 గంటకు ప్రారంభం కావాల్సి ఉండగా 2:48 గంటకు హెలికాప్టర్‌ ద్వారా మణుగూరు చేరుకున్నారు.

సభా ప్రాంగంణం 10 వేల మందికి ఏర్పాటు చేశారు. అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో జనం రావడంతో హనుమాన్‌టెంపుల్‌ వరకు జనంతో జాతరను తలపించింది. సభా ప్రాంగణం సరిపోక పోవడంతో పక్కన వున్న ఖాళీ ప్రదేశం నుంచి, పక్కన ఉన్న భవనాలు గోడలు, భవనాలపై నిలబడి ప్రజలు కేసీఆర్‌ ప్రంగాన్ని తిలకించారు. సీఎం కేసీఆర్‌ పినపాక నియోజకవర్గానికి మొదటి సారి రావడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ మణుగూరుకు రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అంతేకాకుండా కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి మణుగూరు కోల్‌బెల్ట్‌కు రావడంతో కార్మికులు కూడా భారీగా సభకు హాజరయ్యారు. అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి తోగ్గూడెం సమ్మక్క సారలమ్మ టెంపుల్‌ వరకు భారీగా ట్రాపిక్‌ జామ్‌ అయింది. కేసీఆర్‌ మాట్లాడుతూ...  పినపాక నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. జనాన్ని చూసి కేసీఆర్‌ ‘పాయం’ గాలి బాగుంది భారీ మెజారిటీతో గెలుపుఖాయమని అనడంతో జనం కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top