ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యాన్ని సహించం

Mandha Krishna comments on SC and ST Act - Sakshi

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు, సుప్రీంకోర్టు తీర్పులను తిప్పి కొడతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మే 27న వరంగల్‌లో తలపెట్టనున్న సింహగర్జన బహిరంగసభను పురస్కరించుకొని శనివారం రాత్రి ఇక్కడ జల్‌పల్లిలోని మరాఠా భవన్‌లో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. దళిత, గిరిజనులపై బీజేపీ మొసలి కన్నీరు కార్చడం మానుకొని ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, లేనట్లయితే బీజేపీ భరతం పడతామని హెచ్చరించారు.

ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎస్సీ, ఎస్టీ నేతలందరినీ సంఘటితం చేస్తామన్నారు. వీరిని ఏకం చేసేందుకు సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు ప్రమాదం తీసుకురావాలని కేంద్రంతోపాటు మరెవరు కుట్ర చేసినా తగిన మూల్యం చెల్లించుకుంటారన్న విషయాన్ని సింహగర్జన ద్వారా తెలియజేస్తామన్నారు. సభకు ప్రజాస్వామ్యవాదులంతా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మే 6న హైదరాబాద్‌లో దళిత, గిరిజన మేధావులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సభకు సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ కె.జి.బాలక్రిష్ణన్‌ను ఆహ్వానిస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు జేబీ రాజు, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top