పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం 

Man Suicide Attempt In Front Of Jogipet Police Station - Sakshi

అప్రమత్తమై మంటలను ఆర్పిన ఎస్‌ఐ

బాధితుడిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు

జోగిపేట(అందోల్‌) : పోలీస్‌స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం.. ఎస్‌ఐ చాకచక్యంగా మంటలను ఆర్పి అతడిని కాపాడిన ఘటన జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. పేకాటలో తన వద్ద నుంచి రూ.1500 డబ్బులు తీసుకున్నాడని, ఆ డబ్బులను నర్సింహులు నుంచి తిరిగి ఇప్పించాలని మేకల పవన్‌ (30)అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో పోలీసులు వారిద్దరిని పిలిపించి సర్దిచెప్పి పంపించారు. దీనికి సంతృప్తి చెందని పవన్‌ అనంతరం ఎస్‌ఐ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఇంటికి వచ్చిన పవన్‌ను ఇక్కడికెందుకు వచ్చావని ఎస్‌ఐ మందలించగా తనకు న్యాయం కావాలని మొండిగా మాట్లాడడంతో కానిస్టేబుల్‌ను పిలిపించి అతడిని అక్కడి నుంచి పంపించేశాడు.  

పెట్రోల్‌ డబ్బాతో స్టేషన్‌కి.. 
అనంతరం స్థానికంగా ఉన్న ఒక పెట్రోల్‌ పంపుకు వెళ్లి బాటిల్‌లో పెట్రోల్‌ కావాలని అడుగగా పోయమని నిరాకరించడంతో మార్గమధ్యలో కలిసిన అనిల్‌ అనే వ్యక్తి బండి ఆపి వేరే పెట్రోల్‌ పంపుకువెళ్లి పెట్రోల్‌ తీసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే లిఫ్ట్‌ ఇచ్చిన అనిల్‌ను బాగా కొట్టడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెట్రోల్‌ డబ్బాతో స్టేషన్‌కు చేరుకున్నపవన్‌.. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మండుతున్న మంటలతోనే ఎస్‌ఐ ఉన్న గదిలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎక్కడ తమను పట్టుకుంటాడేమోనని పోలీలు మొదట ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన ఎస్‌ఐ అతడిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ముఖం శరీరం బాగా కాలిపోయింది. వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. పోలీసులు అప్రమత్తంగా లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఇప్పటి వరకు మూడు సార్లు ఆత్మహత్యాయత్నాని పవన్‌ పాల్పడ్డారు.
 
ఆత్మహత్యాయత్నం కేసు నమోదు.. 
పోలీసుస్టేషన్‌కు వచ్చి వంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించినందుకు  మేకల పవన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు. అతడు ఇంట్లో భార్యను బాగా కొట్టినట్లు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. తన వద్ద నుంచి రూ.1500  నర్సిహుంలు అనే వ్యక్తి తీసుకున్నట్లు స్టేషన్‌కు వచ్చాడని, అతడిని పిలిచి విచారించామని తెలిపారు. స్టేషన్‌లోకి మంటలతో రావడంతో తాము ఆర్పివేసి ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అక్కడ చికిత్సలు పొందుతున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top