breaking news
Jogipeta police station
-
పేకాట లొల్లి.. మంటలతోనే ఎస్ఐ గదిలోకి..
జోగిపేట(అందోల్) : పోలీస్‌స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం.. ఎస్ఐ చాకచక్యంగా మంటలను ఆర్పి అతడిని కాపాడిన ఘటన జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. పేకాటలో తన వద్ద నుంచి రూ.1500 డబ్బులు తీసుకున్నాడని, ఆ డబ్బులను నర్సింహులు నుంచి తిరిగి ఇప్పించాలని మేకల పవన్ (30)అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో పోలీసులు వారిద్దరిని పిలిపించి సర్దిచెప్పి పంపించారు. దీనికి సంతృప్తి చెందని పవన్ అనంతరం ఎస్ఐ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఇంటికి వచ్చిన పవన్‌ను ఇక్కడికెందుకు వచ్చావని ఎస్ఐ మందలించగా తనకు న్యాయం కావాలని మొండిగా మాట్లాడడంతో కానిస్టేబుల్‌ను పిలిపించి అతడిని అక్కడి నుంచి పంపించేశాడు. పెట్రోల్ డబ్బాతో స్టేషన్‌కి.. అనంతరం స్థానికంగా ఉన్న ఒక పెట్రోల్ పంపుకు వెళ్లి బాటిల్లో పెట్రోల్ కావాలని అడుగగా పోయమని నిరాకరించడంతో మార్గమధ్యలో కలిసిన అనిల్ అనే వ్యక్తి బండి ఆపి వేరే పెట్రోల్ పంపుకువెళ్లి పెట్రోల్ తీసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే లిఫ్ట్ ఇచ్చిన అనిల్‌ను బాగా కొట్టడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెట్రోల్ డబ్బాతో స్టేషన్‌కు చేరుకున్నపవన్.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మండుతున్న మంటలతోనే ఎస్ఐ ఉన్న గదిలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎక్కడ తమను పట్టుకుంటాడేమోనని పోలీలు మొదట ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ అతడిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ముఖం శరీరం బాగా కాలిపోయింది. వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. పోలీసులు అప్రమత్తంగా లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఇప్పటి వరకు మూడు సార్లు ఆత్మహత్యాయత్నాని పవన్ పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నం కేసు నమోదు.. పోలీసుస్టేషన్‌కు వచ్చి వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించినందుకు మేకల పవన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. అతడు ఇంట్లో భార్యను బాగా కొట్టినట్లు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. తన వద్ద నుంచి రూ.1500 నర్సిహుంలు అనే వ్యక్తి తీసుకున్నట్లు స్టేషన్‌కు వచ్చాడని, అతడిని పిలిచి విచారించామని తెలిపారు. స్టేషన్లోకి మంటలతో రావడంతో తాము ఆర్పివేసి ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అక్కడ చికిత్సలు పొందుతున్నట్లు తెలిపారు. -
న్యాయం కోసం..
జోగిపేట, న్యూస్‌లైన్: మర్వెళ్లి సజీవదహనం ఘటనలో న్యాయం కోసం బాధితులు పోరుబాట పట్టారు. దళితసంఘాలు, టీఆర్ఎస్ నేతల మద్దతుతో మంగళవారం ఏకంగా జోగిపేట పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. దీంతో రాకపోకలు 2 గంటల పాటు నిలిచిపోయాయి. స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 24వ తేదీన మర్వెళ్లి గ్రామంలో జరిగిన ఘటనలో నలుగురు సజీవదహనం కాగా, పోలీసులు ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. దీంతో ఆగ్రహించిన బాధిత బుడగ జంగాలు, దళిత సంఘాలు, టీఆర్ఎస్ నేతల మద్దతుతో మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా తరలివెళ్లి స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట రెండు గంటలపాటు బైఠాయించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, కేసును సీబీసీఐడికి అప్పగించాలని నినాదాలు చేశారు. వీరి ఆందోళనతో నారాయణఖేడ్, సంగారెడ్డి రహదారులపై వాహనాలు బారులు తీరాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన విరపింపజేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిందితులను ఎప్పుడు పట్టుకుంటారని ఆందోళనకారులు ఈ సందర్భంగా పోలీసులను నిలదీశారు. బాధితుడు అనుమానిస్తున్న ఆదాంను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐలు చెప్పినా వారు వినిపించుకోలేదు. సజీవ దహనం సంఘటన వెనుక ఉన్న పెద్దలను పట్టుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దళిత మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కదిరి కృష్ణ సజీవ దహన ఘటనలో బాధ్యులైనవారు ఎంతటివారైనా శిక్షించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామన్నారు. అనంతరం పోలీసులకు వినతిపత్రం సమర్పించి ఆందోళన విరమించారు. ఆందోళనకారులపై సీఐ ఆగ్రహం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన వారిపై స్థానిక సీఐ సైదానాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పనినిమిత్తం సంగారెడ్డి వెళ్లిన ఆయన, ఆందోళనకారులు రాస్తారోకోను విరమించిన కొద్దిసేపటికే జోగిపేటకు చేరుకున్నారు. ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయాలని గానీ, ఇలా పోలీసుస్టేషన్ ఎదుటే బైఠాయించడమేమిటని ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కిష్టయ్య, సీఐ సైదానాయక్ల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కొద్దిమందిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు 151 సెక్షన్ ప్రకారం వారిచేత సంతకాలు తీసుకుని గంట తర్వాత విదిలిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బుడగ జంగాలతో పాటు టీఆర్ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శులు డి.బి.నాగభూషణం, ఎ.శంకరయ్య, టీఆర్ఎస్ నాయకుడు డి.బాలరాం, మండల నాయకులు ిసీహెచ్.వెంకటేశం, ఏ.గోపాల్, పి.లక్ష్మణ్, బుడగ జంగాల జోగిపేట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంకురాములు తదితరులు పాల్గొన్నారు.