న్యాయం కోసం.. | justice on Marvelli burning alive incident | Sakshi
Sakshi News home page

న్యాయం కోసం..

Feb 5 2014 12:38 AM | Updated on Sep 2 2017 3:20 AM

మర్వెళ్లి సజీవదహనం ఘటనలో న్యాయం కోసం బాధితులు పోరుబాట పట్టారు. దళితసంఘాలు, టీఆర్‌ఎస్ నేతల మద్దతుతో మంగళవారం ఏకంగా జోగిపేట పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు.

జోగిపేట, న్యూస్‌లైన్: మర్వెళ్లి సజీవదహనం ఘటనలో న్యాయం కోసం బాధితులు పోరుబాట పట్టారు. దళితసంఘాలు, టీఆర్‌ఎస్ నేతల మద్దతుతో మంగళవారం ఏకంగా జోగిపేట పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.  దీంతో రాకపోకలు 2 గంటల పాటు నిలిచిపోయాయి. స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత నెల 24వ తేదీన మర్వెళ్లి గ్రామంలో జరిగిన ఘటనలో నలుగురు సజీవదహనం కాగా, పోలీసులు ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. దీంతో ఆగ్రహించిన బాధిత బుడగ జంగాలు, దళిత సంఘాలు, టీఆర్‌ఎస్ నేతల మద్దతుతో మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా తరలివెళ్లి  స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట రెండు గంటలపాటు బైఠాయించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, కేసును  సీబీసీఐడికి అప్పగించాలని నినాదాలు చేశారు. వీరి ఆందోళనతో నారాయణఖేడ్, సంగారెడ్డి రహదారులపై వాహనాలు బారులు తీరాయి.

దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన విరపింపజేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిందితులను ఎప్పుడు పట్టుకుంటారని ఆందోళనకారులు ఈ సందర్భంగా పోలీసులను నిలదీశారు. బాధితుడు అనుమానిస్తున్న ఆదాంను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐలు చెప్పినా వారు వినిపించుకోలేదు. సజీవ దహనం సంఘటన వెనుక ఉన్న పెద్దలను పట్టుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దళిత మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కదిరి కృష్ణ సజీవ దహన ఘటనలో బాధ్యులైనవారు ఎంతటివారైనా శిక్షించి, బాధితులకు  న్యాయం జరిగేలా చూడాలన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామన్నారు. అనంతరం   పోలీసులకు వినతిపత్రం సమర్పించి ఆందోళన విరమించారు.

 ఆందోళనకారులపై సీఐ ఆగ్రహం
 పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన వారిపై స్థానిక సీఐ సైదానాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పనినిమిత్తం సంగారెడ్డి వెళ్లిన ఆయన, ఆందోళనకారులు రాస్తారోకోను విరమించిన కొద్దిసేపటికే జోగిపేటకు చేరుకున్నారు. ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయాలని గానీ, ఇలా పోలీసుస్టేషన్ ఎదుటే బైఠాయించడమేమిటని ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కిష్టయ్య, సీఐ సైదానాయక్‌ల మధ్య వాగ్వాదం జరిగింది.

 అనంతరం కొద్దిమందిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు 151 సెక్షన్ ప్రకారం వారిచేత సంతకాలు తీసుకుని గంట తర్వాత విదిలిపెట్టారు.  కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బుడగ జంగాలతో పాటు టీఆర్‌ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శులు డి.బి.నాగభూషణం, ఎ.శంకరయ్య, టీఆర్‌ఎస్ నాయకుడు డి.బాలరాం, మండల నాయకులు ిసీహెచ్.వెంకటేశం, ఏ.గోపాల్, పి.లక్ష్మణ్, బుడగ జంగాల జోగిపేట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంకురాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement