
పెళ్లయిన 15 రోజులకే భార్య హత్య!!
పాలమూరులో దారుణం జరిగింది. పెళ్లయిన 15 రోజులకే కట్టుకున్న భార్యను ఓ భర్త హతమార్చాడు.
పాలమూరులో దారుణం జరిగింది. పెళ్లయిన 15 రోజులకే కట్టుకున్న భార్యను ఓ భర్త హతమార్చాడు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆమే ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఈ ఘోరం మద్దూరు మండలం రెనివట్లలో జరిగింది. రెనివట్ల గ్రామానికి చెందిన గోవిందమ్మ (19)కు అమ్మానాన్నలు లేరు. అన్నయ్యే అన్నీ అయ్యి పదిహేను రోజుల క్రితం పెళ్లి చేశాడు. మద్దూరుకు చెందిన గోపాల్ (25) అనే వ్యక్తికి 31,500 నగదు, 3 తులాల బంగారం కట్నంగా ఇచ్చి ఆమెను కట్టబెట్టారు.
వ్యవసాయ పనులు, ఉపాధి హామీ కూలి పనులు చేసుకునే గోపాల్పై గతంలో చిన్న చిన్న దొంగతనాలకు సంబంధించిన కేసులున్నాయి. కాగా, గోవిందమ్మ మంగళవారం నాడు అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం వరకు బాగానే ఉన్నారు. తెల్లవారేసరికల్లా ఆమె ఉరేసుకున్నట్లు కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన గోవిందమ్మ అన్న.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గోపాల్ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.