హైకమాండ్‌పై మల్లేష్‌ ఫైర్‌

Mallesh Fires on High Command Over Ibrahimpatnam Seat - Sakshi

టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణ 

పెద్దల అవినీతి బయటపెడతానని హెచ్చరిక 

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ పార్టీకి షాక్‌ ఇచ్చారు. టికెట్‌ ఇవ్వడం లేదనే సంకేతాల నేపథ్యంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఇబ్రహీంపట్నం శాసనసభ స్థానం టికెట్‌ను ఆశిస్తున్న ఆయనకు ఢిల్లీ పరిణామాలు నిరాశజనకంగా కనిపించడంతో పార్టీ హైకమాండ్‌పై తిరుగుబాటు చేశారు. బుధవారం తన నివాసంలో సన్నిహితులతో మంతనాలు జరిపిన ఆయన ఈ నెల 17న నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. టికెట్లు అమ్ముకున్నారని పార్టీ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ పెద్దల అవినీతి బాగోతానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో వాటిని బయటపెడతానన్నారు.

టికెట్ల కేటాయింపులో బీసీ సామాజికవర్గానికి తీరని అన్యాయం చేశారని, గొల్ల, కురుమలకు కేవలం ఒకే సీటును కేటాయించడమేమిటని నిలదీశారు. పార్టీకి వ్యతిరేకంగా తన సామాజికవర్గాన్ని ఏకం చేస్తానని హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీ ప్లీనరీని ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తనకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాగా, గత ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టిన మల్లేశ్‌ ఇబ్రహీంపట్నం సీటు తనకే దక్కుతుందనే ధీమాతో పనిచేశారు. అంతేగాకుండా రాజకీయ గురువు, కర్ణాటక మాజీ సీఎం సిద్ధిరామయ్య ఆశీస్సులు కూడా ఉండడం కలిసివస్తుందని అంచనా వేశారు. అయితే, అనూహ్యంగా ఈ సీటును మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది.

నాలుగైదు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి పరిణామాలను గమనించిన ఆయన బుధవారం ఉదయం నగరానికి చేరుకున్న వెంటనే కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హస్తినలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, టికెట్‌కు కత్తెర పెడుతున్న అంశాన్ని వారితో చర్చించి.. ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దీనికి ఆయన సన్నిహితుల నుంచి సానుకూల స్పందన రావడంతో పార్టీ హైకమాండ్‌పై ధిక్కార స్వరం వినిపించారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఆశించి భంగపడ్డ మల్‌రెడ్డి బ్రదర్స్‌లో ఒకరు రెబల్‌గా బరిలో దిగగా.. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమవుతుండడం గమనార్హం.

చంద్రశేఖర్‌ రాజీనామా 
మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్న ఆయన.. నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీని వీడిన చంద్రశేఖర్‌ను అక్కున చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. టీఆర్‌ఎస్‌ స్థానిక నాయకత్వం అనుకూలంగా ఉన్నా అధిష్టానం నుంచి స్పష్టత రాకపోవడంతో ఆయన చేరికకు అడ్డుగా మారింది. బీజేపీలో చేరడం వల్ల మైనార్టీ ఓట్లకు గండిపడే అవకాశముందని భావిస్తున్న చంద్రశేఖర్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడమే మంచిదనే భావనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top