ఇంకా ‘ఫిట్‌’ కాలేదు! | Malkapur Fitness Testing Center was not started | Sakshi
Sakshi News home page

ఇంకా ‘ఫిట్‌’ కాలేదు!

Jan 28 2019 1:42 AM | Updated on Jan 28 2019 1:42 AM

Malkapur Fitness Testing Center was not started - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీ కోసం చౌటుప్పల్‌ సమీపంలోని మల్లాపూర్‌లో  ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి నోచుకోవట్లేదు. యంత్రాలతో వాహనాల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేసి 10 నిమిషాల్లో సర్టిఫికెట్‌ జారీ చేసే సామర్థ్యం ఈ కేంద్రం ప్రత్యేకత. 95 శాతం పూర్తయిన ఈ కేంద్రాన్ని 2018 మే నెలాఖరుకు ప్రారంభించాలి. కానీ పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వస్తోంది. పనులు పూర్తయి ఏడాది కావొస్తున్నా దీన్ని ప్రారంభించట్లేదు. ఈ సెంటర్‌ ప్రారంభోత్సవాన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. 

జాప్యానికి కారణాలేంటి? 
ఈ కేంద్రానికి కేటాయించిన ప్రాంతంలోని 10 గుంటల స్థలం వివాదంలో చిక్కుకుంది. ఈ స్థలం తనదంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దీంతో దీని ప్రారంభోత్సవంలో జాప్యం నెలకొంటోంది. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మేరకు కొనుగోలు చేసిన యంత్రాలు వృథాగా ఉన్నాయి. వీలైనంత త్వరగా దీన్ని ప్రారంభించాలని, లేకపోతే కోట్లు వెచ్చించి తెప్పించిన యంత్రాలు పనికిరాకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నేపథ్యం ఇదీ..! 
రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనానికి ఫిట్‌నెస్‌ ఎంతో కీలకం. ఈ విషయంలో రాష్ట్ర రవాణా అధికారులు వాహనాల ఫిట్‌నెస్‌ జారీకి ఇంకా మాన్యువల్‌ విధానాన్నే పాటిస్తున్నారు. దీనివల్ల అనేక అవకతవకలకు ఆస్కారం ఉంది. మామూళ్ల కోసం పలువురు ఆర్టీఏ అధికారులు ఫిట్‌నెస్‌ లేని వాహనాలకు పర్మిట్లు ఇస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రానికి అనుమతి, నిధులు సమకూర్చింది. 2014లో ఈ సెంటర్‌ నిర్మాణానికి కేంద్రం వాటా మేరకు రూ.14.4 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2015 జూన్‌లో చౌటుప్పల్‌ సమీపంలోని మల్లాపూర్‌లో దాదాపు 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ పనులకు అప్పటి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రోజుకు 250 నుంచి 300 వాహనాలను తనిఖీ చేసి సర్టిఫికెట్లు జారీ చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. రద్దీని బట్టి దీని కెపాసిటీని పెంచుకునే అవకాశం కూడా ఉంది. పూర్తి అత్యాధునిక ఆటోమేటెడ్‌ యంత్రాలతో వాహనాలకు ఈ కేంద్రంలో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది దేశంలోనే రెండో కేంద్రం కావడం విశేషం. ఈ సెంటర్‌లో అవసరమైన వాటిలో ఇప్పటివరకు 70 శాతం యంత్రాలు వచ్చాయి. 

ఏమేం పరీక్షలు చేస్తారు? 
ఇక్కడి యంత్రాలన్నీ కంప్యూటర్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. సర్టిఫికెట్ల జారీ కూడా కంప్యూటర్ల ద్వారానే జరుగుతుంది. వాహనాల బ్రేకులు, పీయూసీ, ఇంజిన్‌ కండీషన్, గేర్‌బాక్స్, హెడ్‌లైట్లను పరీక్షించేందుకు ఇక్కడ అత్యాధునిక యంత్రాలు అమర్చారు. నిర్ణీత ప్రమాణాల మేరకు వాహనాల పరికరాల్లోని లోపాలను ఇవి క్షణాల్లో గుర్తిస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement