హే.. అల్లా

Makka Masjid Repair Works Delayed - Sakshi

మక్కా మసీదు మరమ్మతు పనులకు నిధుల కొరత

ఏడాదిన్నర నుంచి కొనసా..గుతున్న పనులు

కేటాయించింది రూ.8.48 కోట్లు.. విడదలైంది రూ.2 కోట్లు మాత్రమే

చారిత్రక కట్టడం పరిరక్షణపై తీవ్ర నిర్లక్ష్యం

సాక్షి సిటీబ్యూరో: చారిత్రక మక్కా మసీదు పరిరక్షణలో నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనబడుతోంది. నిధుల విడుదలలో జాప్యం, అధికారుల మధ్య కొరవడిన సమన్వయలేమి శాంపంగా మారింది. సకాలంలో మరమ్మతు పనులు చేయకపోవడంతో మసీదు పైకప్పు నుంచి నీరు కారుతోంది. నీరు ప్రవేశించి మసీదు గోడలు బీటలు వారుతున్నాయి. దీంతో వర్షకాలంలో మసీదు పై నుంచి నీరు కారుతోంది. మసీదు కుడి వైపు ముందు భాగంలో రెండో నిజాం నుంచి ఆరో నిజాం వరకు సమాధులున్నాయి. ఈ సమాధులపై ఉన్న కప్పు శిథిలావస్థకు చెరుకుంది. కప్పు కూలే పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందర్శకులకు అటు వెళ్లకుండా బారికేట్లు పెట్టారు. రెండేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు  ప్రచురిచడంతో అధికారులు స్పందించి మక్కా మసీదు మర్మమ్మతు పనులను 2017 ఆగస్టు 23న రూ. 8.48 కోట్లు నిధులు కేటాయించారు.

నత్తనడకన పనులు..
1694లో నిర్మాణం పూర్తి చేసుకున్న మక్కా మసీదు హైదరాబాద్‌ చరిత్రలో చెరగని ముద్రవేసుకుంది. ఇస్లామిక్‌ నిర్మాణశైలితో ఇరానీ అర్కిటెక్చర్‌ నైపుణ్యంతో నిర్మించారు. మసీదును ఆర్కియాలజీ శాఖ హెరిటేజ్‌ బిల్డింగ్‌గా గుర్తించింది. అయితే కాలక్రమేణా మసీదు దెబ్బతినడం ప్రారంభమైంది. పైకప్పు నుంచి నీరు లీకవ్వడం, పగుళ్లు ఏర్పడడం లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం మక్కా మసీదు పునరుద్ధరణ, సంరక్షణకు చర్యలు చేపట్టింది. రూ. 8.48 కోట్ల నిధులు కేటాయించింది. కానీ కేవలం రూ. 2 కోట్లు విడదల చేయడంతో మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి.

పురావస్తు శాఖ పర్యవేక్షణలో పనులు
మక్కా మరమ్మతు పనులను వక్ఫ్‌ బోర్డు ద్వారా రాష్ట్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో చేయాలని నిర్ణయించారు.  మొదటి దశలో మసీదు పైకప్పు మరమ్మతులతో పాటు గోడల్లో నీరు రాకుండా పనులు కొనసాగాయి. పురావస్తు శాఖ సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వర్కర్లను తెప్పించినట్లు అధికారులు తెలిపారు. పనులను టెండర్‌ ద్వారా కేటాయించారు. నిధులు విడుదల కాకపోవడంతోనే కాంట్రాక్టర్‌ పనులను నిలిపి వేసినట్లు సమాచారం. 

శాఖల మధ్య సమన్వయ లోపం
మరమ్మతు పనులు పురావస్తు శాఖ పర్యవేక్షణలో జరుగుతున్నా నిధులు మాత్రం మైనార్టీ సంక్షేమ శాఖ వక్ఫ్‌ బోర్డు ద్వారా చెల్లిస్తోంది. అడపదడపా  మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు, కార్యదర్శి, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మసీదు పనులను పరిశీలించి వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని మరికొంత మంది నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని ప్రకటనలు చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులతో సంప్రదించకుండా ప్రకటనలు చేస్తున్నారు. ఇరు శాఖల మధ్య సమన్వయం లేక పోవడంతోనే పనుల్లో జాప్యం జరగుతుందని సమాచారం. ఇప్పటికైనా ఇరు శాఖల అధికారులు సమావేశం ఏర్పాటు చేసి మసీదు పనులు ఎప్పుడు పూర్తవుతాయే చెప్పాలని ఇటు పర్యాటకులు, ముస్లింలు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top