మాకోద్దు బాబోయ్‌

Mahabubnagar People Don't Want New Industry - Sakshi

బాలానగర్‌ (మమబూబ్‌నగర్‌) : ప్రస్తుతం ఉన్న పరిశ్రమతోనే ఎంతో కాలుష్యం వెలువడుతుందని, చెట్లు సైతం నల్లగా దుమ్ముతో కమ్ముకుంటున్నాయని, ఇక కొత్త పరిశ్రమ మాకు వద్దే వద్దంటూ గ్రామస్తులు వెల్లడించారు. మండలంలోని గుండేడ్‌లో ప్రస్తుతం ఉన్న దిలీప్‌ రోలింగ్‌ మిల్‌ పరిశ్రమను విస్తరించేందుకు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ క్రాంతి, పొల్యూషన్‌ బోర్డు ఈఈ దయానంద్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిశ్రమ సైతం నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని, మొదట ఆ పరిశ్రమను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ఏ ఒక్కరికో ప్రయోజనం ఉందని వేల సంఖ్యలోని ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు సైతం పరిశ్రమ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో అనుమతి కంటే 5 రెట్లు ఎక్కువ ఉత్పత్తిని చేస్తున్నా రికార్డులలో చూపడం లేదని, వెలువడుతున్న కాలుష్యంతో అటు గాలి, ఇటు నీరు కలుషితమవుతుందని దీంతో ప్రజలు, జీవాలు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. పరిశ్రమతో అంతర్గతనీరు కలుషితమై పంటలు పండించడానికి ఉపయోగం లేకుండా పోయాయన్నారు. 

నిబంధనలకు తూట్లు
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, జడ్చర్ల ఇన్‌చార్జ్‌ అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మకై నియమ, నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. పరిశ్రమ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల వరకు సర్వే నిర్వహించాల్సిన అధికారులు, గ్రామంలో పరిశ్రమ ప్రతులను ఎజెండాను తెలుగులో, ఇంగ్లిష్‌లో ప్రచురించి గ్రామంలో పంచాలని, అలాంటిది ఏమీ లేకుండా ప్రజలను మోసం చేశారన్నారు. పరిశ్రమలో సుమారు 30 శాతం పచ్చదనం ఉండాలని కేవలం 5, 6 చెట్లు మాత్రమే పరిశ్రమలో ఉన్నాయని అన్నారు. పరిశ్రమ వారు అధికారికంగా 90శాతం పొల్యూషన్‌ ఉన్నా రెడ్‌ క్యాటగిరిలో ఉండాల్సిన పరిశ్రమను ఆరెంజ్‌ పరిశ్రమగా తప్పుడు లెక్కలు చూ పారని అన్నారు.

పరిశ్రమకు ప్రతి నిత్యం పదుల సంఖ్యలో వ్యవసాయ బోర్ల నుండి నీటిని తరలిస్తున్నా ఎలాంటి చర్యలు ఎం దుకు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. పరిశ్రమ యాజమాన్యం 2శాతం ఆదాయాన్ని ప్రజాసేవకు ఎక్కడ ఖర్చుచేశారో రికార్డులు సమర్పించాలని అన్నారు. 360 మంది కార్మికులు ఉన్నా ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు ఎంతమందికి ఉన్నా యో తెలపాలన్నారు. రికార్డులను తక్కువ చెబుతూ అటు ప్రభుత్వానికి టాక్స్‌ రూపంలో దోపిడీ చేస్తున్నారని అన్నారు. పరిశ్రమకు సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న టీటీడబ్ల్యూఆర్‌ఎస్‌ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్స్‌ మాట్లాడుతూ.. పరి శ్రమ వారు వదిలే కాలుష్యంతో విద్యార్థులు తరచూ అనారోగ్యం భారిన పడుతున్నారని అధికారులకు విన్నవించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశ్వర్లుతోపాటు ఇతర అధికారులు, వందల సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top