లోక్‌సభ ఎన్నికలకు పోలీస్‌శాఖ కసరత్తు

Lok Sabha Election Officers Busy Mahabubnagar - Sakshi

పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మరో ఎన్నికల సమరానికి అధికార యంత్రాంగం, పోలీస్‌ శాఖ, ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. శాసనసభ ఎన్నికలు ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన అధికారులు, పోలీసులు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓ పర్యాయం ఈవీఎంల పరిశీలన, అధికారులతో సమావేశాలు, వీడియో కాన్షరెన్స్‌లు జరిగాయి.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు.. 
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్‌ ఎన్నికలను సమర్థవంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తొలిదశ ఈవీఎంల తనిఖీలను చేపట్టగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి నాలుగు జిల్లాల కలెక్టర్‌లు పాల్గొన్నారు. ఈవీఎంల పనితీరు, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన పద్ధతులపై సీఈసీ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఇటీవల ఈవీఎంల తనిఖీలపై కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే అంశంపై వికారాబాద్‌ కలెక్టర్‌ను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతలో జాగ్రత్తలు పాటించాలని సీఈసీ స్పష్టం చేసింది. రెండు రోజుల పాటు సుధీర్ఘంగా సాగిన శిక్షణలో శాసనసభ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, సమస్యలు, తదితర వివరాలను నాలుగు జిల్లాల కలెక్టర్లు వివరించగా వచ్చే ఎన్నికల్లో అలాంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి నుంచి అధికారులను ఆప్రమత్తం చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

ప్రత్యేక ప్రణాళికలు 
లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలొస్తే విధులు నిర్వహించడం పోలీసులకు కత్తిమీద సామే. ఈ మేరకు  పక్కా వ్యూహంతో ముందుకెళ్లడానికి పోలీసుశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికల సమయంలో 45 రోజుల పాటు ఎన్నికల కమిషన్‌ చేతిలోకి సర్వాధికారాలు వెళ్తాయి. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్‌ శాఖలపై సీఈసీ గుత్తాధిపత్యం ఉంటుంది. సీఈసీ అనుమతి లేనిదే ఏ పనీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా శాంతి భద్రతల విధులు నిర్వర్తించడంలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంటుంది.

పోలీసుశాఖ విధులే కీలకం 
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే పార్టీల ప్రచారాలు హోరెత్తుతాయి. ఈ సమయంలో అనవసర ఎస్కార్ట్‌లు చేపట్టడం కుదరదు. ప్రస్తుతం ఉభయ జిల్లాలో కలిపి 3500 మంది సివిల్, ఏఆర్‌ సిబ్బంది పని చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల సమస్యాత్మక ఘటనలు జరిగిన దాఖలాలున్నాయి. పార్టీల నాయకులు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లారు. ఈ తరహా ఘటనలకు ఈసారి అవకాశం లేకుండా ముందస్తు వ్యూహం చేయాల్సిన అవసరం ఉంది.

సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జాబితాతో పాటు డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుంటారు.  శాంతి భద్రతల పరిరక్షణలో ముందస్తు సమాచారం కోసం పోలీసు శాఖలో స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగం సిబ్బంది పని చేస్తున్నారు. ఈ విభాగాన్ని ఎన్నికల సమయంలో పూర్తిగా వాడుకుంటారు. ఇందుకోసం విభాగాన్ని కింది నుంచి బలోపేతం చేసేలా చాకచక్యంగా వ్యవహరించేవారు, క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారం రాబట్టే వారిని నియమించుకుని ముందుచూపుతో వ్యవహరించనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top