పశువుల వ్యర్థాలతో నూనె తయారీ | Livestock waste With Oil Manufacturing | Sakshi
Sakshi News home page

పశువుల వ్యర్థాలతో నూనె తయారీ

Jan 12 2016 11:54 PM | Updated on Mar 28 2018 11:26 AM

పశువుల వ్యర్థాలతో నూనె తయారీ - Sakshi

పశువుల వ్యర్థాలతో నూనె తయారీ

గుట్టచప్పుడు కాకుండా పశువుల వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్న ఓ స్థావరంపై పోలీసులు దాడి చేశారు.

మర్పల్లి: గుట్టచప్పుడు కాకుండా పశువుల వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్న ఓ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నూనె డబ్బాలతో పాటు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను వికారాబాద్ డీఎస్పీ స్వామి విలేకరులకు వెల్లడించారు. మండల పరిధిలోని నర్సాపూర్‌కు చెందిన మొల్ల చోటుమియాకు సర్వే నంబర్ 39లో తనకున్న ఎకరం 14 గుంటల పొలం ఉంది. ఆయన రెండో కుమారుడు బషీర్ నగరానికి చెందిన కొందరి సహకారంతో సదరు పొలంలో జంతువుల వ్యర్థాలతో నూనె తయారు చేయడం ప్రారంభించాడు. వారం రోజుల క్రితం 10 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు కడాయిలు (బాణ)లు ఏర్పాటు చేశాడు.

మూడు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా వేరే ప్రాంతాల నుంచి పశువుల వ్యర్థాలను తీసుకొచ్చాడు. వాటిని కడాయిలో వేసి బాగా మండించి నూనెను తయారు చేస్తున్నారు. కడాయిలో నుంచి ఓ చిన్న మోటారు సాయంతో నూనెను డబ్బాలలో నింపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం విశ్వసనీయంగా తెలుసుకున్న మర్పల్లి పోలీసులు నర్సాపూర్‌కు వెళ్లి నూనె తయారీకేంద్రంపై దాడులు నిర్వహించారు. నిండుగా ఉన్న 50 నూనె డబ్బాలను గమనించి విషయం ఉన్నతాధికారులకు తెలిపారు. అనంతరం నూనె డబ్బాలతో పాటు జనరేటర్, కట్టెలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకొని మర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ స్వామి
భారీ ఎత్తున కల్తీ నూనె తయారీ విషయం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ స్వామి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్థానిక సర్పంచ్‌తో మాట్లాడారు. గ్రామానికి చెందిన బషీర్ 15 రోజుల క్రితం తనను కలిసి తమపొలంలో గ్రీస్ తయారు చేసుకుంటానని చెప్పాడని సర్పంచ్ డీఎస్పీకి తెలిపారు. అనంతరం డీఎస్పీ స్వామి మర్పల్లి ఠాణాలో విలేకరులతో మాట్లాడారు. నర్సాపూర్‌లో జంతువుల వ్యర్థాలతో మూడు రోజులుగా నూనె తయారు చేసేందుకు బట్టీలు పెట్టినట్లు తెలిసిందన్నారు. ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశం తేల్చేందుకు నూనెను ల్యాబ్‌కు తరలించి తద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
నూనె తయారీదారులు పరారయ్యారు తెలిపారు. భూమి యజమాని చోటుమియా కుమారుడు బషీర్‌పై కేసు నమోదు చేశామన్నారు. ఆయనకు సహకరించిన వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఐ రంగా, ఎస్‌ఐ నాగభూషణం సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement