మూడ్రోజుల్లో ఆసరా అర్హుల జాబితా

List of proprietary arrays in three days - Sakshi

పంచాయతీ కార్యదర్శులుగా  ఎంపికైన వారి మార్కులు, కేటగిరీలు ప్రకటించాలి  

జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ ఎస్‌.కె.జోషి వీడియో కాన్ఫరెన్స్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఆసరా పథకంలో మార్పులకు తగినట్లుగా వెంటనే చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్‌ 19న ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా గ్రామాలవారీగా 57 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు ఉన్నవారి వివరాలను మూడ్రోజుల్లో ఈ–సేవ  కమి షనర్‌కు పంపాలని స్పష్టం చేశారు. ఆసరా పింఛన్ల మంజూరు,పంచాయతీ ఎన్నికలు, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రైల్వేల భూ సేకరణ, అటవీ భూముల సర్వేల అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, పీసీసీఎఫ్‌ పి.కె.ఝా, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నీతూ ప్రసాద్, సీసీఎల్‌ఏ డైరెక్టర్‌ వాకాటి కరుణ, సెర్ప్‌ సీఈవో పౌసమిబసు, ఈ–సేవ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  జోషి మాట్లాడుతూ, ‘57 ఏళ్లు నిండిన వారికి వచ్చే ఏప్రిల్‌ నుంచి ఆసరా పింఛన్ల మంజూరుపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అర్హుల జాబితాను కలెక్టర్లు సిద్ధం చేయాలి.  జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన ప్రతి అభ్యర్థికి మార్కులు, ర్యాంకు, కేటగిరీలు ప్రకటించాలి.  జాతీయ రహదారులు, రైల్వేలకు అవసరమైన భూ సేకరణ  ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి’  అని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top