మందు.. మేమే అందిస్తాం..!

Liquor Business Running Illegally In Warangal - Sakshi

వైన్స్‌ నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా...?

ఒక్కో క్వార్టర్, బీరు బాటిల్‌పై రూ. 10 అదనం

నిద్రమత్తులో ఎక్సైజ్‌ అధికారులు 

సాక్షి, ములుగు: జిల్లాలో మద్యం వాప్యారం యధేచ్ఛగా కొనసాగుతోంది. ఉన్నత అధికారులతో సంబంధం లేకుండా ప్రతి రోజూ విచ్ఛలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు నియమాలను అమలు చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిద్రమత్తులో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా ఏర్పాటైన వైన్స్‌ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. స్పందించాలి్సన అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులతో పోలిస్తే పోలీసు శాఖ జరిపే దాడుల్లోనే అధికంగా కేసులు నమోదు అవుతుండడం విశేషం.  

ప్రత్యేక వాహనాల్లో బెల్టు షాపులకు మద్యం..!
గతంలో జిల్లాలోని వివిధ గ్రామాల బెల్టు షాపుల వ్యాపారులు మండల కేంద్రాల్లోని వైన్స్‌ నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్మకాలు జరిపేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారయింది. ఉన్నత అధికారుల నిఘా లోపించడంతో వ్యాపారులు ఒకడుగు ముందుకు వేసి ఆయా మండలాల వారీగా సిండికేట్‌గా మారి ప్రత్యేక వాహనంలో గ్రామాలకు మద్యం  తరలిస్తూ బహిరంగంగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారని తెలుస్తుంది. ఈ దందాను నిలవరించే వారే లేకపోవడంతో వైన్స్‌  వ్యాపారులు రోజు వారీగా బహిరంగ వ్యాపారాలు జరుపుకుంటూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన దందాను విస్తరిస్తున్నారు. ములుగు, వెంకటాపురం(ఎం), ఏటూరునాగారం, వెంకటాపురం(కే), వాజేడు, మంగపేట, ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలాల్లోని వైన్స్‌ వ్యాపారులు  నిత్యం బెల్టు షాపుల నిర్వాహకులకు ఏదో ఒక సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా చేస్తూ దందా కొనసాగిస్తున్నారు.

మంగపేటలో ఇతర ప్రాంతాల నుంచి..
మంగపేట మండలంలోని రాజుపేట, చుంచుపల్లిలో 1/70 చట్టంలో భాగంగా వైన్స్‌ నిర్వహణ లేదు. ఈ పరిణామాన్ని ఆసరాగా తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట, ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని కాటాపురం, ఏటూరునాగారం మండలకేంద్రం నుంచి ఆటోల ద్వారా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. కొంత మంది నేరుగా ద్విచక్ర వాహనాల ద్వారా బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం.  

ఒక్కో బాటిల్‌పై రూ.30 అధికం 
గ్రామాల్లోని »బెల్టు షాపులకు వైన్స్‌ వ్యాపారులు ఒక్కో బీరు, క్వార్టర్‌ బాటిల్‌ను రూ. 10 చొప్పున ఎక్కువకు సరఫరా చేస్తున్నారు. దీంతో బెల్టు షాపుల వ్యాపారులు అదే బాటిల్‌పై రూ. 30 అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం ప్రియులు తమ జేబులను గుళ్ల చేసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో పలుమార్లు ఫిర్యాదులు అందినా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top