లీప్‌ ఇయర్‌..సమ్‌థింగ్‌ స్పెషల్‌

Leap Year 2020 Special Story - Sakshi

ఫిబ్రవరి29న పుట్టిన వారు ప్రత్యేకం..

కుత్బుల్లాపూర్‌: నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ప్రత్యేకమైన సంవత్సరం.. ఏడాదికి 365 రోజులకు గాను ఒక్క రోజు అదనంగా చేరి కేలెండర్‌లో 366 రోజులు కనిపించే ఏకైక సంవత్సరం. ఏడాదికి ఉన్న రోజులలో అదనంగా ఒక రోజు చేరిన సంవత్సరాన్నే లీప్‌ ఇయర్‌ అంటారు.  ఈ సంవత్సరం (2020) లీప్‌ ఇయరే.. లీప్‌ ఇయర్‌ ఆ సంవత్సరంలో పుట్టే వారికి ప్రత్యేకంగా ఉంటుంది.  

ఎన్నో అపోహలు.. నమ్మకాలు..
 లీప్‌ ఇయర్‌ కొందరికి ప్రత్యేకంగా ఉంటే కొందరిలో అపోహలు మరికొందరిలో నమ్మకాలు కలిగిస్తుంది.. 2012లో వచ్చిన లీప్‌ ఇయర్‌ అనంతరం అదే ఏడాది డిసెంబరు 21న ప్రళయం వస్తుందని, భూమి  వినాశనం తప్పదని కొందరు భావించారు. అదే తరహాలో ప్రచారం కూడా తీవ్రస్థాయిలో జరిగింది. ఇదే విధంగా ప్రతి లీప్‌ సంవత్సరంలో అనేకానేక అపోహలు ప్రజలలో కలుగుతున్నాయి. అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం లీప్‌ ఇయర్‌ అందరికి కలిసి వస్తుందని, లీప్‌ ఇయర్‌లో ప్రత్యేకంగా వచ్చి చేరే ఫిబ్రవరి 29వ తారీఖు విశేషంగా భావిస్తారు. ఈ రోజున పుట్టిన వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారనేది నమ్మకం. కాని కొందరు చెప్పేది ఏమిటంటే లీప్‌ ఇయర్‌లో ఒక రోజు మాత్రమే అదనంగా వచ్చి చేరుతుందని ఇంకెలాంటి విశేషం ఉండదని చెబుతారు. 

అసలేంటిఈ లీప్‌ఇయర్‌..  
ప్రతి ఏడాది 365 రోజులు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఏడాది 365 రోజుల 6 గంటలు ఉంటుంది.  365 రోజలనే పరిగణలోకి తీసుకుని మిగిలిన ఆరు గంటలను ఏ విధంగా లెక్కించాలో మీమాంసలో ఏడాదికి మిగిలిపోయిన ఆరు గంటల సమయాన్ని నాలుగు సంవత్సరాల పాటు లెక్కించి  వచ్చిన 24 గంటల సమయాన్ని ఒక రోజుగా గుర్తించడంతో ఫిబ్రవరి నెలలో 29వ తారీఖుగా పరిగణిస్తున్నారు. ఇలా ఫిబ్రవరి నెలలో అదనంగా వచ్చి చేరే ఒక రోజును లీప్‌ సంవత్సరంగా పిలుస్తుంటారు. 

ఆత్రుతగా  ఎదురుచూస్తాం
1996 ఫిబ్రవరి 29వ మా విహాహం జరిగింది. 24 సంవత్సరాల మా దాంపత్య జీవితంలో ఆరు సార్లు పెళ్లి  రోజులను జరుపుకున్నాం. నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మా పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడానికి మాతో పాటు మా కుటుంబ సభ్యులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. ఈ సారి 2020లో వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాం.   – శైలజ, సునీల్, జగద్గిరిగుట్ట

ఫిబ్రవరి29న పుట్టిన వారు ప్రత్యేకం..
ముఖ్యంగా లీప్‌ సంవత్సరంలో వచ్చే ఫిబ్రవరి 29 ఆ రోజు ‘పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతరత్రా శుభాకార్యాలు జరిపిన వారికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫిబ్రవరి 29న పుట్టిన వారు నాలుగు సంవత్సరాలకు వచ్చే లీప్‌ సంవత్సరంలో వేడుకలు నిర్వహించుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు.  2020 ఫిబ్రవరి 29న కొందరు గర్భీణీలు డెలివరీ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.  

లీప్‌ ఇయర్‌లోనే పుట్టిన రోజు, వివాహం.. 
నేను పుట్టింది ఫిబ్రవరి 29.. నా ఎంగేజ్‌మెంట్‌   ఉమారాణితో అయింది ఫిబ్రవరి 29 నాడే. 2012 ఫిబ్రవరి 29న నా ఎంగేజ్‌మెంట్, మార్చి నెలలో వివాహం జరిగింది. అయితే మా వివాహ రోజు కన్నా ఫిబ్రవరి 29న నాడు జరిగిన ఎంగేజ్‌మెంటే నాకు ప్రత్యేకం. 2020లో నా పుట్టిన రోజుతో పాటు మరో వేడుక చేసుకోవడానికి ఎంతో ఎదురు చూస్తున్నా.    – శ్రవణ్,  ఉమారాణి, చింతల్‌..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top