చట్టాలకు పదును పెట్టాలి

Laws have to be sharpened - Sakshi

నేరస్తులు అడవిలోకి అడుగుపెట్టాలంటేనే భయపడాలి

అటవీ నేరాల అదుపునకు ఇంటెలిజెన్స్‌ తోడ్పాటు, పటిష్ట ఇన్‌ఫార్మర్ల  వ్యవస్థ

పోలీస్, అటవీ శాఖల సాయుధ సిబ్బందితో నేరాల అదుపునకు తక్షణ చెక్‌ పోస్టుల ఏర్పాటు... సచివాలయం నుంచి సీఎస్‌ వీడియోకాన్ఫరెన్స్‌  

సాక్షి, హైదరాబాద్‌: అటవీ నేరాల విచారణ, కఠిన శిక్షల ఖరారులో మరింత వేగం పెంచుతామని, ప్రస్తుత చట్టాలకు పదునుపెట్టి త్వరలోనే మరింత కఠిన చట్టం తీసుకురానున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి వెల్లడించారు. అటవీ నేరస్తులు ఇకపై అడవుల్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడాలని, కఠినంగా వ్యవహరించటం ద్వారా నేరాలను అదుపులో పెట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రానున్న ఐదేళ్లు పచ్చదనం పెంపు, అడవుల రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశంగా సీఎం చెప్పారని, హరితహారంతో అడవుల బయట, కఠిన చర్యలతో అడవి లోపల పచ్చదనాన్ని రక్షించుకోవాలన్నారు. అటవీ ప్రభావిత జిల్లాల్లో సాయుధ బలగాలతో అటవీ, పోలీస్‌ శాఖలతో ఉమ్మడిగా 54 చెక్‌ పోస్టుల ఏర్పాటుకు ఆదేశించారు. ఫిబ్రవరి ఆరుకల్లా ప్రతి జిల్లాలో అటవీ రక్షణ కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను కూడా ఉపయోగిస్తామని, అటవీ నేరస్తులపై సరైన సమాచారం ఇచ్చే ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను పెంచి, రివార్డులు కూడా ఇస్తామన్నారు.

పర్యావరణ పరంగా అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారన్నారు. సోమవారం సచివాలయం నుంచి అడవుల రక్షణ, సంబంధిత నేరాల అదుపుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్, అటవీశాఖ అధికారులు, సిబ్బందితో చీఫ్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, పోలీసుల వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని, అన్ని స్థాయిల్లో పోలీస్‌ సిబ్బంది స్థానిక అటవీ అధికారులకు సహకరిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్‌ఓలు కలిసి ఒక టీమ్‌ గా అటవీ నేరాలను అరికట్టేందుకు పనిచేయాలన్నారు. అడవులపై నిరంతర నిఘా కోసం సాయుధ పోలీసుల పహారా ఉంటుందన్నారు. తరచుగా అటవీ నేరాలకు పాల్పడే నేరస్తులను జియో ట్యాగింగ్‌ చేస్తామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలప కోత యంత్రాలపై (సా మిల్లులపై) నిఘా ఉంచుతామన్నారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ, అడవిని కాపాడటం ఒక ఎత్తు అయితే, క్షీణించిన అడవులను పునరుద్ధరించుకోవటం మరో ఎత్తు అన్నారు. అటవీ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అదిలాబాద్‌ జిల్లాలో ముల్తానీలను కలప స్మగ్లింగ్‌ నుంచి దూరం చేసేందుకు అవసరమైన పునరావాస ప్యాకేజీని వెంటనే ఆమోదిస్తామన్నారు. పీసీసీఎఫ్‌ పీకే ఝా మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసుల సహకారంతో అటవీ ఆక్రమణలు జరగకుండా చూస్తామని, వన్యప్రాణుల వేటపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, అడిషనల్‌ డీజీ జితేందర్, ఐ.జీలు నాగిరెడ్డి, స్టీఫెన్‌ రవీంద్ర, పీసీసీఎఫ్‌ విజిలెన్స్‌ రఘువీర్, అదనపు పీసీసీఎఫ్‌లు మునీంద్ర, లోకేశ్‌ జైస్వాల్, డోబ్రియల్, తిరుపతయ్య, స్వర్గం శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top