సిమెంట్‌ ధరలు తగ్గించండి

KTR Speaks About Real Estate Situations In Telangana - Sakshi

కరోనాతో దెబ్బతిన్న రియల్టీ రంగానికి చేయూత

డబుల్‌ బెడ్రూం పథకానికి పాత ధరకే సిమెంట్‌

సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, వేముల భేటీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మూలంగా దెబ్బతిన్న రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఆదుకునేందుకు సిమెంట్‌ ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. లాక్‌డౌన్‌ మూలంగా ఇతర రంగాల మాదిరిగానే భవన నిర్మాణ రంగం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి గురువారం సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పథకం కోసం సిమెంట్‌ బస్తాను రూ. 230 చొప్పున ఇచ్చేందుకు 2016లో సిమెంట్‌ కంపెనీలు అంగీకరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు బస్తాకు రూ.230కి సిమెంట్‌ సరఫరా చేయాలని మంత్రులు చేసిన ప్రతిపాదనకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. అయితే రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సరఫరా చేసే సిమెం టు ధరలకు సంబంధించి త్వరలో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకుని ఎంత మేర తగ్గిస్తామనే అంశాన్ని తెలియజేస్తామన్నారు.

స్థానిక యువతకు ఉపాధి
సిమెంట్‌ పరిశ్రమలకు నిలయంగా ఉన్న హుజూర్‌నగర్‌ ప్రాంతంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే అవకాశంపైనా సమావేశంలో చర్చించారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. తమకు అవసరమైన సిబ్బందిని ఈ శిక్షణ కేంద్రం నుంచి ఎంపిక చేసుకుంటామని సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top