నేడే టీఆర్‌ఎస్‌ సన్నాహక సభ 

Ktr Political Tour To Yadadri - Sakshi

సాక్షి, యాదాద్రి : లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నిర్వహిస్తోన్న భువనగిరి పార్లమెంటరీస్థాయి సన్నాహాక సమావేశం గురువారం జిల్లా కేంద్రంలో జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకమారావు హాజరుకానున్నారు.  మధ్యాహ్నం 2గంటలకు జరిగే సమావేశానికి సంబంధించి పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు  పూర్తి చేశారు. సభా ప్రాంగణమంతా గులాబీమయంగా మార్చేశారు. 

20వేల మందితో..

పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 20వేల మంది ప్రతినిధులతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి,  జనగామ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2వేల మంది ప్రతినిధులు రా వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సమావేశం జరుగుతున్న భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అదనంగా ప్రతినిధులు హాజరుకానున్నారు. సమావేశానికి హాజరయ్యే టీఆర్‌ఎస్‌ శ్రేణుల కోసం భోజన వసతులను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భోజనాలు ప్రతినిధులకు అందుబాటులో ఉంటాయి.

సమావేశానికి టీఆర్‌ఎస్‌ గ్రామ, మండల శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సహకార సంఘాల చైర్మన్‌లు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లు రైతు సమన్వయ సమితి సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ ప్రముఖులు హాజరవనున్నారు. 

ఏర్పాట్ల పరిశీలన

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొనే సన్నాహక సమావేశ సభా ప్రాంగణాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు పరిశీలించారు. ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, గాదరి కిశోర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నువ్వుల ప్రసన్న పరిశీలించి పలు సూచనలు చేశారు.

వరంగల్‌లో సన్నాహక సభను పూర్తి చేసుకుని జిల్లాకు వస్తున్న కేటీఆర్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి వంగపల్లి నుంచి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాయగిరి నుంచి సభా వేదిక వరకు భారీ బైక్‌ ర్యాలీతో స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top