ప్రాజెక్టుల్లో ‘ఆవిరి’ లెక్కలెంత..? 

Krishna Board Instructs Telugu States About Sagar And Srisailam Projects - Sakshi

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులవారీ చెప్పాలని తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఆవిరి నష్టాలు (ఎవాపరేషన్‌ లాస్సెస్‌)పై కృష్ణా బోర్డు దృష్టి పెట్టింది. ప్రస్తుతం వేసవి సీజన్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో ఉండే ఆవిరి నష్టాల లెక్కలు తేల్చాలని నిర్ణయించింది. ఇప్పటికే తనవద్ద ఉన్న వివరాలతో ఆవిరి నష్టాలను అంచనా వేసిన కృష్ణాబోర్డు, దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అభిప్రాయాలను సైతం కోరింది. ఈ నష్టాలను లెక్కిస్తున్న తీరు, ఇంతవరకు జరిగిన ఆవిరి నష్టాలపై తమకు నివేదిక సమర్పించాలని కోరుతూ గురువారం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఇందులో ప్రాజెక్టు ల నుంచి గత ఏడాది జూన్‌నుంచి ఇంతవరకు రెండు ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదల, ప్రవాహాలు, విద్యుత్‌ వినియోగం, నిల్వలు తదితర వివరాల ఆధారంగా ఆవిరి నష్టాలపై తన అభిప్రాయాన్ని తెలిపింది.

శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో గత ఏడాది జూన్‌నుంచి ఫిబ్రవరి చివరి వరకు 50 రోజులు ఎలాంటి ఆవిరి నష్టాలు లేవని, 128 రోజుల్లో మాత్రం 300 క్యూసెక్కులు అంతకుమించి ఆవిరి నష్టం ఉందని తెలిపింది. ఆగస్టు, అక్టోబర్‌ మధ్యలో ఆవిరి నష్టాలు 450 నుంచి 900 క్యూసెక్కుల మేర ఉన్నాయంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 2016–17లో 7.40 టీఎంసీ, 2017–18లో 3.02, 2018–19లో 4.07, 2019–20 (ఫిబ్రవరి) వరకు 6.65 టీఎంసీలుగా ఉందని బోర్డు వెల్లడించింది. ఇక సాగర్‌ పరిధిలో 143 రోజుల పాటు 300 క్యూసెక్కులకు పైగా ఆవరి నష్టాలున్నాయని బోర్డు వెల్లడించింది. ఇక 2016–17లో 10.58, 2017–18లో 8.88, 2018–19లో 11.66, 2019–20లో 7.64 టీఎంసీల మేర ఆవిరి నష్టాలున్నాయని తెలిపింది.తెలుగు రాష్ట్రాలు 2019–20 ఏడాదిలో ఏ మేరకు ఆవిరి నష్టాలు గమనించాయో తమకు తెలియజేయాలని కోరింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top