కొడుకు కడచూపునకు నోచుకోని తల్లిదండ్రులు

Kondagattu Death Victim Harsha Funeral Without His Parents - Sakshi

మొన్ననే రాఖీ కట్టిన తమ్ముడు ప్రమాదంలో విగతజీవుడయ్యాడు. తమ్ముడితో వెళ్లిన అమ్మ చావుబతుకుల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. బతుకుదెరువు కోసం నాన్నేమో దుబాయ్‌కు పోయిండు.. ఏం చేయాలో తెలియని ఆ అక్కాచెల్లెళ్లు.. ‘లేరా తమ్ముడూ ఆడుకుందాం’ అంటూ ఏడుస్తున్న ఘటన హృదయాల్ని పిండేస్తోంది..

సాక్షి, కొండగట్టు: గుండెల్ని పిండేసే ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ ఊరు కన్నీటి ప్రవాహంగా మారింది. ఎవరిని కదిలించినా కన్నీళ్లు తప్ప.. మాటలు రావడం లేదు. వెక్కివెక్కి ఏడ్చేవాళ్లు కొందరు.. తమ వాళ్లను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని వారిని ఓదార్చేవాళ్లు ఇంకొందరు.. ప్రమాద బాధిత శనివారంపేటలో ఎవరిని కదిలించినా ఇదే దృశ్యాలు. కొండగట్టు రోడ్డు ప్రమాదంలో ఈ ఊరి నుంచే ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారి హర్ష అంత్యక్రియలు తల్లితండ్రులు లేకుండానే పూర్తయ్యాయి. 

గ్రామానికి చెందిన గాజుల లత, అశోక్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు హర్ష(2). అశోక్‌ బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లగా.. లత గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తోంది. అనారోగ్యంతో ఉన్న కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆమె జగిత్యాలకు బస్సులో బయల్దేరింది. అంతలోనే ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిపింది. ప్రమాదంలో హర్ష మరణించగా.. అతడి తల్లి తీవ్రంగా గాయపడింది. అప్పటి వరకు తమతో ఆడుకున్న హర్ష ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో అతడి అక్కలు తట్టుకోలేకపోయారు. తమ్ముడు కావాలి అంటూ ఏడుస్తున్న ఆ చిన్నారులను ఆపడం ఎవరితరం కావడం లేదు.

గల్ఫ్‌లో ఉన్న తండ్రికి కుమారుడి మరణ వార్త ఎలా తెలియజేయాలో తెలియక మధన పడ్డ కుటుంబ సభ్యులు చివరకు ఆ బాలుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. గల్ఫ్‌లో ఉన్న ఆ తండ్రి, ఆసుపత్రిలో ఉన్న ఆ తల్లి తన ముద్దుల కొడుకును కడసారి చూసుకోలేకపోయారు. ఆ తల్లి కోలుకొని తన కొడుకు ఎక్కడా అని అడిగితే ఏమని చెప్పాలని బంధువులు బోరుమంటున్నారు. రాఖీ పౌర్ణమీ సందర్భంగా తన అక్కలు రాఖీ కడితే హర్ష కాళ్లు మొక్కి డబ్బులు కూడా ఇచ్చాడని ఆ ఫొటోలు ఇవే అంటూ చూపిస్తూ వారు కంటతడి పెట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top