టీఆర్‌ఎస్‌పై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Konda Vishweshwar Reddy Sensational Comments On TRS - Sakshi

కేసీఆర్‌ పార్లమెంట్‌లో మా పరువు తీశారు

టీఆర్‌ఎస్‌లో చాలామంది అసంతృప్తితో ఉన్నారు

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ను విభేదించి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై సంచలన ఆరోపణలకు తెరలేపారు. ఆ పార్టీలో చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని.. జితేందర్‌ రెడ్డి, కేశవరావు వంటి నేతలు కూడా పార్టీని వీడే అలోచనలో ఉన్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రైవేట్‌ లిమిటెట్‌ కంపెనీ అని వారంతా మాట్లాడుకుంటూ ఉంటారని.. ఇదివరకు జై తెలంగాణ అన్న నేతలంతా ఇప్పుడు జై కేసీఆర్‌, జై కేటీఆర్‌ అంటున్నారని పేర్కొన్నారు.

ఆదివారం ఆయన మీడియాతో​ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవం దెబ్బతినడం వల్లనే ఆ పార్టీకి రాజీనామా చేశానని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌ శాసనసభకు వచ్చేవరకు అది ఎలా ఉంటుందో కూడా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు తెలియదన్నారు. ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి టీఆర్‌ఎస్‌లో గౌరవం లేదని, కొత్తగా చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. కారణం తెలపకుండా పైలెట్‌ రోహిత్‌ రెడ్డిని సస్పెండ్‌ చేశారని, ఇప్పుడు ఆయనే మంత్రి మహేందర్‌ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నారని తెలిపారు.

మహేందర్‌ రెడ్డి తన మనుషులను కొట్టించారని, ఎంపీగా ఉండి కూడా అతనిపై కేసు పెట్టలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి వెళ్తానన్నా కేసీఆర్‌ వద్దనేవారని, నియోజకవర్గంలో కూడా తనని పర్యటించకుండా కట్టడిచేసేవారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ జాతీయ హోదాపై పార్లమెంట్‌లో పోరాడమని కేసీఆర్‌ సూచించారని, కానీ ఆయన మాత్రం జాతీయ హోదా కోసం కేంద్రానికి దరఖాస్తు చేయలేదన్నారు. కేసీఆర్‌ తీరుతో కేంద్రమంత్రి వద్ద తమ పరువుపోయిందని, తన డ్రెస్‌పై కూడా కేసీఆర్‌ కామెంట్‌ చేసేవాడని వ్యాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top