కోమటిరెడ్డి అరెస్ట్‌.. భువనగిరిలో ఉద్రిక్తత

Komatireddy Venkat Reddy Arrested At Yadadri Bhuvanagiri - Sakshi

సాక్షి, యాదాద్రి: స్థానిక ప్రజా ప్రతినిధులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆందోళన చేస్తుండగా.. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలు కాగా.. భువనగిరి మండలం వడపర్తి గ్రామ సర్పంచ్‌ కాలు విరిగింది. ఉద్రిక్తతల నడుమ కోమటిరెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ గత ఐదేళ్ల నుంచి స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తూ.. స్థానిక ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల నిధులు-విధులు కోసం పోరాటాల గడ్డ అయిన భువనగిరి నుంచి పోరాటం మొదలు పెట్టామన్నారు. స్థానిక సంస్థల నిధులు-విధులు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులందరు ఈ పోరాటంలో కలసి రావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రం, మైనింగ్‌, రిజిస్ట్రేషన్‌ శాఖల నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు కేటాయించకుండా కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. గ్రామ పంచాయతీలకు చెక్‌ పవర్‌ కల్పించి సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు మధ్య కొట్లాట పెట్టారని కోమటిరెడ్డి ఆరోపించారు. హరితహారంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటే సర్పంచ్‌ మీద వేటు వేయడం సబబు కాదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top