బోర్డు రద్దు యోచన సమర్థనీయం కాదు | Kodandaram Demands For TRS Responsible For Inter Results | Sakshi
Sakshi News home page

బోర్డు రద్దు యోచన సమర్థనీయం కాదు

Apr 26 2019 2:07 AM | Updated on Apr 26 2019 2:07 AM

Kodandaram Demands For TRS Responsible For Inter Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్‌బోర్డు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించాయని తెలంగాణ జన సమి తి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అన్ని విషయాలు బయటికి వస్తాయని, విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. పరీక్షల ఫీజుల వసూలు మొదలు ఫలితాల ప్రకటన వరకు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇంటర్‌ బోర్డును ప్రక్షాళన చేయాల్సింది పోయి, బోర్డునే రద్దు చేయాలని ఆలోచించడం సమర్థనీయం కాదన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ చేస్తున్నట్టుగా వస్తున్న ప్రతిపాదనలను తాము అంగీ కరించే ప్రసక్తి లేదన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన విధులను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించాలన్న ఆలోచన సరికాదన్నారు. గురువారం పార్టీ నాయకులు ప్రొ.పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, రమేశ్‌రెడ్డి, భావనారెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌లతో కలసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. ఇంటర్‌ ఫలితాల గందరగోళానికి టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం, బోర్డు కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బాధ్య త వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై నైతికబాధ్యత వహించి విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  

గ్లోబరీనాను ఎందుకు వెనుకేసుకొస్తున్నారు...
బోర్డు కార్యదర్శి, ఇతర అధికారులు ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి గ్లోబరీనా సంస్థను వెనకేసుకొస్తున్నారో చెప్పాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో నైపుణ్యం, సామ ర్థ్యం లేని ఈ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన కీలకబాధ్యతలు ఇంటర్‌ బోర్డ్‌ ఎలా అప్పగించిందని ప్రశ్నించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి అన్ని విషయాలు తెలుసని, అయినా చర్యలు తీసుకోలేకపోయారని ఆరోపించారు. రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు పట్టే సమయం, ఇతరత్రా విషయాల్లోనూ హైకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని, ఈ వ్యవహారంలో తాము కూడా ఇంప్లీడ్‌ అవుతామని వెల్లడించారు. చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కూడా అరెస్ట్‌ చేసే దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద టీజేఎస్‌ రిజిస్టర్‌ పార్టీ అని, అయినా జెడ్పీటీసీ అభ్యర్థులకు అగ్గిపెట్టె, ఎంపీటీసీ అభ్యర్థులకు గ్యాస్‌సిలిండర్‌ గుర్తులు కేటాయించారని, ఎన్నికల కమిషన్‌ చేసిన లోపం వల్ల తమ అభ్యర్థులు, పార్టీ ఇబ్బందులు పడాల్సి వస్తోం దని కోదండరాం అన్నారు. గురువారం ఈ అంశాన్ని తాము కమిషనర్‌ నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement