ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిల హవా.. | Girls outdo boys in Telangana Inter results | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిల హవా..

Apr 23 2025 3:20 AM | Updated on Apr 23 2025 3:20 AM

Girls outdo boys in Telangana Inter results

ఫలితాలను విడుదల చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, పొన్నం, ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు

ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణతలో బాలురపై పైచేయి

ఫస్టియర్‌ బాలురు 57.83%.. బాలికలు 73.83%.. 

సెకండియర్‌ బాలురు 57.31%.. బాలికలు 74.21% ఉత్తీర్ణత

మొత్తంగా రెండేళ్లూ కలిపి 65.81 శాతం ఉత్తీర్ణత నమోదు 

ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మిడియెట్‌ ఫలితాల్లో బాలికలు అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో బాలురు 57.83 శాతం పాసయితే, బాలికలు ఏకంగా 73.83 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 57.31 ఉంటే, బాలికల ఉత్తీర్ణత శాతం దాదాపుగా ఫస్టియర్‌ మాదిరే 74.21 శాతం నమోదైంది. మొత్తంగా (రెండేళ్ళు కలిపి) ఈ ఏడాది ఇంటర్‌ ఉత్తీర్ణత 65.81గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 5%ఎక్కువ. 

ఆసిఫాబాద్‌లో అత్యధిక శాతం ఉత్తీర్ణత 
మార్చి 5 నుంచి 25వ తేదీల మధ్య ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఇంటర్‌ పరీక్షలకు రెండు సంవత్సరాలకు కలిపి 9,97,012 మంది హాజరయ్యారని, వీరిలో 6,56,099 మంది పాసయ్యారని భట్టి తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు చేసిందని తెలిపారు.

కాగా ఫస్టియర్‌లో మహబూబాబాద్, సెకెండియర్‌లో కామారెడ్డి అతితక్కువ ఉత్తీర్ణత నమోదు చేశాయని ఆయన వివరించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగిరాణా, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, ప్రత్యేక కార్యదర్శి హరిత, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరీక్ష విభాగం ముఖ్య అధికారి జయప్రదాబాయ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మే 22 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 
    ఇంటర్మీడియెట్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు మే 22 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. జూన్‌ 3 నుంచి ఆరు వరకూ ప్రాక్టికల్స్‌ ఉంటాయని చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షా ఫలితాలకు సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోరుకునే విద్యార్థులు ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement