దశాబ్దాల కల నెరవేరింది!

Khilla Ghanpur Awaited Road  Come In To Existance - Sakshi

రూ.3.35 కోట్లతో బీటీ రోడ్లు 

గ్రామీణ ప్రజల సంతోషం 

సాక్షి,ఖిల్లాఘనపురం: పల్లెటూర్లు, గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న ఖిల్లాఘనపురం మండలంలో పలు గ్రామాలకు, గిరిజన తండాలకు నేటికీ బీటీ రోడ్డు సౌకర్యం లేదు. బీటీ రోడ్లు వేయించాలని గ్రామాలకు, గిరిజన తండాలకు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రజలు పలుసార్లు మొరపెట్టుకున్నప్పటికి ఫలితం లేకపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత దశాబ్ధాలుగా బీటీ రోడ్ల కోసం ఎదురు చూస్తున్న పల్లెప్రజలు, గిరిజనుల కల నెరవేరింది.

రూ.3.35 కోట్లతో బీటీ రోడ్లు 
మండలంలోని పలు గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్ల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి  ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పలు గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరయ్యాయి. ఇటీవల పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ వేగంగా పనులు చేపట్టి పూర్తి చేశారు.ఇందులో రూ.0.85 కోట్లతో అంతాయపల్లి నుంచి కొత్తపల్లి వరకు కిలోమీటర్, కోటి రూపాయలతో కమాలోద్ధీన్‌పూర్‌ అడ్డరోడ్డు నుంచి భూత్పూర్‌ మండలం పోల్కంపల్లి వరకు 2 కిలోమీటర్లు, రూ. 1.5 కోట్లతో సోళీపురం నుంచి కోతులకుంట తండా వరకు 1.5 కిలో మీటర్‌ బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇలా మండలంలోని మూడు రోడ్లకు బీటీ వేసేందుకు ప్రభుత్వం రూ.3.35 కోట్ల నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. 

తగ్గిన దూరభారం 
మండలంలోని కమీలోద్దీన్‌పూర్‌ అడ్డరోడ్డు నుంచి భూత్పూర్‌ మండలం పోల్కంపల్లి వరకు బీటీ రో డ్డు వేయడం వలన మండల ప్రజలకు జాతీయ రహదారి దగ్గర కావడంతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు దూరభారం తగ్గింది. గాజులపేట, తాటికొండ తదితర గ్రామాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటుంది.  అంతాయపల్లి నుంచి కొత్తపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యమే లేదు. పొలాలగుండా, పొలం గట్ల వెంట ప్రజలు కాలినడకన వెళ్లేవారు. 5ఏళ్ల కిత్రం ఫార్మేషన్‌ రోడ్డు వేశారు. నేడు బీటీ రోడ్డుగా మార్చారు. సోళీపురం నుంచి కోతులకుంట తండాకు వరకు  మట్టిరోడ్డు మాత్రమే ఉండేది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత గిరిజనుల కోరిక మేరకు మంత్రి నిరంజన్‌రెడ్డి బీటీ రోడ్డు మంజూరు చేయించడంతో కాంట్రాకర్టర్‌ ఇటీవలే పనులు పూర్తి చేశారు.
   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top