కారు మబ్బులు!

KCR MLA Candidates Announced Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆపరేషన్‌ ఆకర్ష్‌తో పార్టీలో చేరిన సిట్టింగ్‌లందరికీ సీట్లు ప్రకటించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పాత కాపులను పక్కనపెట్టారు. 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన నాలుగింటిలో మూడు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. దీంతో టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ అభ్యర్థిని ఓడగొట్టే దిశగా పావులు కదుపుతున్నారు. అలకపాన్పు ఎక్కిన నేతలను శాంతింపజేసే దిశగా అధినాయకత్వం ఆలోచన చేయకపోవడం కూడా తిరుగుబాటుకు కారణమవుతోంది. అసంతృప్తి నేతలంతా అభ్యర్థికి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారు.

వాస్తవానికి గత ఎన్నికల్లో 14 చోట్ల పోటీచేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులలో ఈసారి కేవలం ముగ్గురికి మాత్రమే టికెట్లు లభించాయి. ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి (తాండూరు) అభ్యర్థిత్వం ఖరారు కాగా, పోటీ చేసి పరాజయం పాలైన రామ్మోహన్‌గౌడ్‌ (ఎల్‌బీనగర్‌), బేతి సుభాష్‌రెడ్డి (ఉప్పల్‌)కి మాత్రం మళ్లీ టికెట్లు దక్కాయి. గత ఎన్నికల్లో పరిగి నుంచి పోటీ చేసిన హరీశ్వర్‌రెడ్డి స్థానే ఆయన కొడుకు మహేశ్‌రెడ్డికి ఖాయమైంది. వీరు మినహా తక్కిన అభ్యర్థులంతా ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారే. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని ఆశావహులు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు.

తిరుగుబాటే..! 
సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే తిరిగి టికెట్‌ ఖాయం చేయడంతో షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ రాజకీయం రచ్చకెక్కింది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి కాస్తా టికెట్ల ప్రకటనతో తారస్థాయికి చేరింది. ఎంపీ జితేందర్‌రెడ్డి అండతో వీర్లపల్లి శంకర్, మరో ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌ ఆశీస్సులతో అందె బాబయ్య టికెట్‌ పొందాలని వ్యూహరచన చేశారు. అనూహ్యంగా అంజయ్య యాదవ్‌కే మళ్లీ టికెట్‌ దక్కింది. ఈ పరిణామంతో బిత్తరపోయిన వైరివర్గాలన్నీ ఏకతాటి మీదకు వచ్చాయి. అంజయ్య ఓటమే లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించాయి. రెండు రోజులుగా అనుచరులతో భేటీ అవుతున్న వైరివర్గం.. తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
 
వెనక్కి తగ్గేది లేదు.. 
మహేశ్వరం నుంచి పోటీచేసి భంగపడ్డ కొత్త మనోహర్‌రెడ్డి ఈసారి టికెట్‌ లభించకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వానికి పచ్చజెండా ఊపడంతో రెబల్‌ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. అలాగే, కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసిన కొలను హన్మంతరెడ్డి కూడా కదనరంగంలో ఉంటున్నట్లు స్పష్టం చేశారు. టికెట్‌ ఇవ్వకుండా అధిష్టానం మోసం చేయడంపై కినుక వహించిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. 2014లో ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగిన కంచర్ల చంద్రశేఖరరెడ్డి పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా అధినాయకత్వం వైఖరిపై మాత్రం ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి టికెట్‌ రావడంతో కంచర్ల సహా అసమ్మతి రాగాలు వినిపిస్తున్న నిరంజన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ మేరకు రెండురోజులుగా అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. 

వద్దంటే.. వద్దు 
చేవెళ్ల టికెట్‌ విషయంలో చుక్కెదురు కావడంతో పార్టీ అధినాయకత్వంపై మాజీ ఎమ్మెల్యే రత్నం వర్గీయులు గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలిచి గెలిచిన యాదయ్యను పార్టీలో చేర్చుకోవడంతోనే ఆగ్రహం వ్యక్తం చేసిన రత్నం తాజా పరిణామాలపై అనుచరులతో చర్చిస్తున్నారు. పొమ్మనలేక పొగ పెట్టారని, సీటు ఇవ్వకుండా అవమానించిన పార్టీలో కొనసాగేకన్నా.. ప్రత్యామ్నాయం చూసుకోవడమే మంచిదనే భావన ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. వికారాబాద్‌ సీటు ఖరారు చేసినా పోటీ చేయకూడదని, ఇస్తే.. చేవెళ్లే లేదంటే లేదు అన్న తరహాలో ముందుకు సాగాలని రత్నం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చేవెళ్లలో ఆదివారం జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, అమావాస్య దృష్ట్యా ప్రకటించకూడదని అనుకుంటున్నట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top