అంగరంగ వైభవంగా యాదాద్రి ప్రతిష్ఠ కార్యక్రమం: కేసీఆర్‌

KCR Inspects Yadadri Renovation Works - Sakshi

ఈ మహాక్రతువు ఎప్పుడన్నది నేను చెబుతా.. ఓ కార్యకర్తగా పనిచేస్తానన్న సీఎం

1008 హోమ గుండాలు, సహస్రకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన

మరో 250 ఎకరాల స్థలాన్ని సేకరిస్తున్నట్లు వెల్లడి

సమైక్యపాలనలతో యాదాద్రి, జోగులాంబలను విస్మరించారని విమర్శ  

సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ ప్రతిష్ఠ ఆషామాషీగా ఉండదని.. దేశంలోనే మునుపెన్నడూ లేనివిధంగా అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా జరిపిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అయితే ప్రతిష్ఠ ఎప్పుడనేది తానే వెల్లడిస్తానన్నారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన మందిర నిర్మాణ పనులను సమీక్షించారు. ‘ప్రతిష్ఠ ఆషామాషీగా ఉండదు. నెలకో, రెన్నెల్లకో జరగదు. ఇంత గొప్ప క్రతువు ఎట్లా జరగాలో.. అట్లాగే జరగాలి. తొందరలో జరిగే కార్యక్రమం కాదిది. పరిగెత్తి కట్టం. వేల సంవత్సరాలు ఉండే ఆలయం. కాబట్టి పవిత్రమైన ఆలయ ప్రతిష్ఠ రోజున 1008 హోమ గుండాలతో యాగం నిర్వహిస్తాం.

దేశంలోనే ఎక్కడా జర గని విధంగా ఆలయ ప్రతిష్ఠ ఉంటుంది. శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగు తుంది. సహస్రకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగంతో ఆలయాన్ని ప్రతిష్ఠిస్తాం. ఈ మహా క్రతువులో నేనూ ఒక కార్యకర్తగా పని చేస్తా’అని ఆయన పేర్కొన్నారు. సుమారు 6 గంటలకు పైగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు, టెంపుల్‌ సిటీ, ప్రెసిడెన్షియల్‌ సూట్‌లతో పాటు వివిధ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా టెంపుల్‌ సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ఆలయ ప్రతిష్ఠాపనకు బద్రీనాథ్‌తోపాటు దేశ, విదేశాల నుంచి వైష్ణవాధిపతులు హాజరవుతారన్నారు. ఐదారున్న వేల మంది రుత్వికులు, రెండున్నర వేల మంది సహరుత్వికులు, 1008 హోమ గుండాల్లో హోమాలు నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. ఆలయ ప్రతిష్ఠ ఆషామాషీగా గ్రామ దేవతల ఆలయాల ప్రారంభోత్సవం మాదిరిగా జరగదని.. దేశంలో మునుప్పెన్నడూ లేని విధంగా ఉంటుందన్నారు.

 
ఆదివారం హెలికాప్టర్‌ నుంచి యాదాద్రి నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌
 
సమైక్య పాలనలో నిర్లక్ష్యం 
సమైక్య పాలనలో యాదాద్రి క్షేత్రం నిర్లక్ష్యానికి గురైందని కేసీఆర్‌ విమర్శించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ శక్తిపీఠం తెలంగాణలో ఉన్నా సమైక్య పాలనలో సరైన ప్రాధాన్యత కల్పించలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక జరిగిన కృష్ణా పుష్కరాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసి, తొలి స్నానం అక్కడే చేశానని వెల్లడించారు. ‘నేను ఎవరికీ భయపడను, ఏ విషయం దాచుకోను. ఈ విషయాన్ని ఉద్యమంలో మాట్లాడాను’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిది శ్రీలంకలో ఉందని, అంతటి విశిష్టత కలిగిన మరోశక్తి పీఠం మన తెలంగాణ జోగులాంబలోనే ఉందన్నారు. విశిష్టమైన పూజలు ఇక్కడ జరుగుతాయని, సమైక్య పాలనలో ఈ క్షేత్రాన్ని వెలుగులోకి రాకుండా చేశారన్నారు.


ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా యాదాద్రిపై పటిష్టమైన బందోబస్తు 

‘యాదాద్రి క్షేత్రం గొప్పగా రూపుదిద్దుకుంటోంది. శని, ఆదివారాల్లో ఇప్పుడే 50వేల నుంచి 70వేల మంది వస్తున్నారు. ఇంతటి పవిత్రత కలిగిన ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం గొప్ప విషయం. 1,100 ఎకరాల్లో టెంపుల్‌ సిటీ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం 832ఎకరాల భూమి ఉంది. మిగిలిన 250ఎకరాలు సేకరిస్తున్నాం’అని సీఎం వెల్లడించారు. 250 ఎకరాల్లో లేఔట్‌ పూర్తయిందని, ఇందులో 354 లగ్జరీ సూట్‌లు నిర్మిస్తామని తెలిపారు. ఇందులో రూ.2కోట్లు, రూ. కోటి, రూ.50లక్షలు, రూ.25లక్షలతో దాతల సహకారంతో సూట్‌లు నిర్మిస్తామన్నారు. ఇందుకోసం ఒక్కో సూట్‌కు రూ.2కోట్లు ఇచ్చేందుకు 48మంది దాతలు ముందుకొచ్చారన్నారు. తిరుపతి, ఇతర దివ్య క్షేత్రాల్లో నిర్మించిన విధంగా స్వామి వారి నామాలతో బ్లాక్‌లు ఉంటాయన్నారు. లక్ష్మీనరసింహస్వామి బ్లాక్, ఆండాళమ్మ బ్లాక్, ప్రహ్లాద బ్లాక్‌ల పేర్లతో ఉంటాయని, మరోసారి సమావేశం నిర్వహించి పద్ధతిగా నిర్మాణాలు జరిగే విధంగా పనులు ప్రారంభిస్తామన్నారు. 


కేసీఆర్‌కు వేదపండితుల ఆశీర్వచనం. చిత్రంలో ఎంపీలు సంతోష్‌ కుమార్, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత తదితరులు
 
జీయర్‌ స్వామితో వస్తా! 
15 రోజుల తరువాత శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామితో కలిసి మళ్లీ యాదాద్రి క్షేత్రానికి వస్తానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. జీయర్‌స్వామి సూచన మేరకు చిన్నచిన్న మార్పులు ఉంటాయన్నారు. ప్రధానంగా పశ్చిమ భాగంలో కొన్ని మార్పులు చేయనున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే యాదాద్రి పుణ్యక్షేత్రం ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంతరించుకోనుందని ఆయన పేర్కొన్నారు. శిల్పాలతో ఏడంతస్తుల గోపురం నిర్మించామని, ఇవి వేల ఏళ్ల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు. నిర్మాణాలు మొత్తం రాతితో జరిగాయని, శిల్ప కళాకృతులు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయని చెప్పారు. యాదాద్రి క్షేత్రం భావి తరాలకు సాంస్కృతిక వారధిగా నిలుస్తుందన్నారు. ఆలయ పనులు బాగా జరుగుతున్నాయని కితాబిచ్చిన సీఎం.. పనుల్లో మరింత వేగం పెరగాలని అధికారులకు సూచించారు. ప్రధాన ఆలయ నిర్మాణం బాగా వచ్చిందని.. శివాలయం గొప్పగా తయారవుతోందన్నారు. యాదాద్రి ఆలయం ఉత్తరంలోని కొండ కింద భాగంలో స్థల సేకరణకు రూ.70కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 143 ఎకరాల భూమి సేకరించామని, మరో 30 ఎకరాలు గండి చెరువులో తెప్పోత్సవం కోసం కేటాయించామని, ఇందుకోసం రూ.70కోట్లు వెంటనే విడుదల చేశామని వెల్లడించారు. జూన్‌ తర్వాత కాళేశ్వరం నీళ్లు వస్తాయని, గండి చెరువులో స్వచ్ఛమైన గోధావరి నీటితో తెప్పోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.  
 
తిరుమల తరహాలో.. 
తిరుపతిలో నిత్యాన్నదాన సత్రం నిర్మించిన రాజు వెగేస్నా నిర్వాహకులు రూ.10కోట్లు నిత్యాన్నదాన సత్రం కోసం విరాళంగా ఇచ్చారన్నారు. అలాగే అన్ని వసతులతో బస్టేషన్, క్యూ కాంప్లెక్స్, కారు పార్కింగ్‌ సెంటర్, వ్యాపార సముదాయాలు, 50–60 ఎకరాల్లో ప్రవచన మంటపం, బ్రహ్మోత్సవ మంటపాలు నిర్మిస్తామని వివరించారు. ఒకటి నుంచి రెండు లక్షల మంది భక్తులు వచ్చినా కొండ కింద కల్యాణోత్సవం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. యాదాద్రి పవిత్రత దెబ్బతినకుండా, జీవ హింసకు తావులేకుండా భక్తులకు వసతులు కల్పించడానికి బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పరిసరాల్లో 261 ఎకరాలు ఉందని, 250 ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్లు వస్తాయని సీఎం చెప్పారు. దీంతో పాటు రిజర్వాయర్‌లో బోటింగ్, వివిధ రకాల విద్యుత్‌ దీపాలు, పార్క్‌లు వస్తాయన్నారు. ఆలయం చుట్టూ రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ పనులు సెప్టెంబర్‌లోగా పూర్తవుతాయన్నారు. ఆలయ ప్రతిష్ఠకు హాజరయ్యే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్‌లు, ముఖ్యమంత్రులు బస చేయడానికి ప్రెసిడెన్షియల్‌ సూట్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆలయానికి అనుబంధంగా కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం, జైన మందిరం, భువనగిరి ఖిలాను అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎంపీలు జే.సంతోష్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాధరి కిశోర్‌కుమార్, మర్రి జనార్దన్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, వైటీడీఏ వైస్‌–చైర్మన్‌ కిషన్‌రావు, కలెక్టర్‌ అనితా రామంచంద్రన్, ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top