పల్లెకు ప్రగతి పాఠాలు

KCR Holds Meeting With Resource Persons In Pragathi Bhavan - Sakshi

సర్పంచ్‌లకు శిక్షణనిచ్చే రిసోర్స్‌ పర్సన్‌లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

గ్రామ పురోగతితోనే దేశాభివృద్ధి

ఊరు రూపురేఖలు మార్చేందుకు ఐదేళ్ల ప్రణాళిక

రిసోర్స్‌ పర్సన్లు చేంజ్‌ ఏజెంట్లుగా పనిచేయాలని సూచన..

సర్పంచ్, కార్యదర్శులు బాధ్యతాయుతంగా ఉండాల్సిందే.. అధికారం చలాయించొద్దు..

సేవచేసే అవకాశమిదని వెల్లడి

జీపీలకు అవసరమైన నిధులను కేటాయిస్తాం

ఉదాహరణలతో గ్రామాభివృద్ధి వివరణ

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ది చెందుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు.. వార్డు మెంబర్లు, ప్రజలను కలుపుకుని సామూహికంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని సీఎం పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని కేసీఆర్‌ కోరారు. మంచినీరు, విద్యుత్‌ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల(శ్మశాన వాటికలు) నిర్మాణంపై గ్రామపంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్‌ పర్సన్స్‌తో కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సర్పంచులు, గ్రామ కార్యదర్శులను.. ‘మార్పును తీసుకొచ్చే ఏజెంట్లు’గా మార్చే బాధ్యత రిసోర్సు పర్సన్లదేనని స్పష్టం చేశారు. పంచాయతీలకు అధికారాలను బదిలీ చేసే విషయంలో, నిధులు కేటాయించే విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉంటుందన్నారు.

కేసీఆర్‌.. టీచర్‌ అవతారం!
రిసోర్సు పర్సన్లకు శిక్షణ ఇచ్చే సందర్భంగా కేసీఆర్‌.. టీచర్‌ అవతారమెత్తారు. ప్రతీ విషయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం నిలబడే మాట్లాడారు. భోజన విరామం తర్వాత 3 నుంచి 5 గంటల వరకు మళ్లీ నిలబడే మాట్లాడారు. గ్రామపంచాయతీ కొత్త చట్టం, పంచాయతీల బాధ్యతలు–విధులు, నిధులు సమకూరే మార్గాలు, ఖర్చు పెట్టే పద్ధతులు, ప్రజా ప్రతినిధులకు నైతిక నియమాలు, రిసోర్స్‌ పర్సన్ల బాధ్యతలపై సుదీర్ఘంగా మాట్లాడారు. సీరియస్‌గా చెబుతూనే అప్పుడప్పుడు చలోక్తులు విసిరారు. దీంతో సభలో నవ్వులు విరబూసాయి. కార్యక్రమం చివరలో సాయంత్రం 5–6 మధ్య ఇంటరాక్టివ్‌ సెషన్‌ జరిగింది. ఈ సందర్భంగా రిసోర్సు పర్సన్ల సందేహాలను సీఎం కేసీఆర్‌ ఓపికగా నివృత్తి చేశారు. వారి పశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఐదేళ్ల ప్రణాళిక
ప్రతీ గ్రామ పంచాయతీ తన పరిధిలోని వనరులు, అవసరాలను బేరీజు వేసుకుంటూ ఐదేళ్ల గ్రామ ప్రణాళిక తయారు చేసుకోవాలని, దానికి అనుగుణంగా పనులు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. గ్రామం ఇప్పుడు ఎక్కడుంది? ఐదేళ్లలో ఎన్ని నిధులు వస్తాయి? వాటితో ఎలాంటి పనులు చేయాలి? అనే విషయాలను నిర్థారించుకుని రంగంలోకి దిగాలన్నారు. ‘చీకట్లో బాణం విసిరినట్లు కాకుండా, లక్ష్యాన్ని గురిచూసి కొట్టాలి. గ్రీన్‌ విలేజ్‌–క్లీన్‌ విలేజ్‌’నినాదంతో గ్రామంలో పచ్చదనం పెంచడానికి, పారిశుద్ధ్య పరిరక్షణకు, శ్మశాన వాటికల నిర్మాణానికి, పన్నుల వసూలుకు మొదటి దఫాలో ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళిక తయారు కావాలి. ఈ ప్రణాళిక తయారీలో సర్పంచులు, కార్యదర్శులకు.. రిసోర్సు పర్సన్లు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. ప్రతీ ఆర్నెల్లకోసారి రిసోర్స్‌ పర్సన్స్‌తో నేను స్వయంగా సమావేశమవుతా’అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

సేవకోసమే పదవి!
‘ప్రజాప్రతినిధులు తాము ప్రజా సేవకులమనే విషయాన్ని మరవద్దు. చట్టసభల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే పదాలు పోవాలి. గ్రామాల్లో కూడా అధికారం అనే మాట రావద్దు. ప్రజాప్రతినిధులు తాము ప్రజాసేవకులమే తప్ప అధికారం చలాయించే వాళ్లం కాదనే భావనతో ఉండాలి. ప్రజలను కలుపుకుని రాజకీయాలకతీతంగా పనిచేయాలి’అని సీఎం పిలుపునిచ్చారు. ‘గ్రామంలో పచ్చదనం పెంచడం పంచాయతీల ప్రధాన బాధ్యతల్లో ఒకటి. మొక్కల పెంపకం కోసం ఉపాధిహామీ నిధులు వాడుకోవాలి’అని సీఎం కేసీఆర్‌ సూచించారు. ‘గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలి. ట్రై సైకిళ్లను, డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేయాలి. ప్రతిఇంట్లో మరుగుదొడ్డి కచ్చితంగా ఉండేలా అవగాహన కల్పించాలి’అని సీఎం కేసీఆర్‌ వివరించారు. ‘సొంత స్థలం లేని వారు తమ కుటుంబ సభ్యులు చనిపోతే ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియదు. ఆ బాధ వర్ణణాతీతం. కాబట్టి ప్రతీ గ్రామంలో ఖచ్చితంగా వైకుంఠధామం నిర్మించాలి. అన్ని గ్రామాల్లో ఆర్నెల్లలో వైకుంఠధామాల నిర్మాణం జరగాలి’అని సీఎం ఆదేశించారు.


భోజన ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం

గ్రామ పంచాయతీ విధులు...
‘ఖచ్చితంగా నూటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలి. పన్నులు వసూలు చేయని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటాం. సర్పంచులు గ్రామంలోనే నివాసం ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. గ్రామావసరాలు గుర్తించాలి. పరిష్కరించడానికి చొరవ చూపాలి. పంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలి. వీధి దీపాలు వెలిగేలా, పగలు వాటిని ఆర్పేలా చర్యలు తీసుకోవాలి. వివాహ రిజిస్ట్రేషన్, జనన, మరణ రికార్డుల నిర్వహణ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే జరగాలి. ప్రతీ గ్రామంలో దోబీఘాట్లు నిర్మించాలి’అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

నిధులొచ్చే మార్గాలివీ!
‘తెలంగాణ గ్రామాల్లో 2.2 కోట్ల జనాభా ఉంది. ఆర్థికసంఘం ద్వారా గ్రామాభివద్ధికి మన రాష్ట్రానికి ఏడాదికి రూ.1,628 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి. మన రాష్ట్రం దానికి మరో రూ.1,628 కోట్లు జోడిస్తుంది. ప్రతీ ఏటా మొత్తం రూ.3,256 కోట్లు సమకూరుతాయి. 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా ఏటా రూ.8 లక్షలు వస్తాయి. జనాభా ఎక్కువున్న గ్రామాలకు ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. ఇవి కాకుండా ప్రతి ఏటా రూ.3,500కోట్ల ఉపాధి నిధులొస్తాయి. రాష్ట్ర బడ్జెట్‌లోనూ నిధులు కేటాయిస్తాం. మొత్తంగా ఐదేళ్లలో రూ.40 వేల కోట్లు గ్రామాలకు సమకూరుతాయి. దీంతో గ్రామాభివద్ధిలో అద్భుతాలు చేయవచ్చు’అని సీఎం వివరించారు. ఇకపై వీధిదీపాలు, ఇతరత్రా అవసరాల కోసం వాడే కరెంటుకు బకాయిల చెల్లింపును ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

పెదిరిపాడు సంఘటనపై ఖండన
మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ బాలప్పను నేలపై కూర్చోబెట్టిన సంఘటనను సీఎం కేసీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఇలా చేయడం దారుణమని అన్నారు. భవిష్యత్తులో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

సమావేశంలో పద్యాలు చదివిన సీఎం
ఆయా అంశాలపై అవగాహన కల్పించే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశంలో పలుమార్లు సందర్భోచితంగా పద్యాలు చదివి అర్థాలను వివరించారు. ‘అనగననగ రాగ మతిశయిల్లుచునుండు’అనే వేమన పద్యం పాడి గ్రామాల్లో సంస్కరణల అమలు నిరంతర ప్రక్రియగా సాగాలని.. కొంత కాలానికి ప్రజలకు, ప్రతినిధులకు అది అలవాటుగా మారుతుందని వివరించారు. ‘నయమున బ్రాలున్‌ ద్రావరు..’అనే సుమతి శతక పద్యంతో.. పంచాయతీలు అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడితే కఠినంగా శిక్షించాలని చెప్పారు. ‘జాతస్యహి ధ్రువో మృత్యుః’అనే భగవద్గీత శ్లోకం చదివి.. పుట్టిన వారు గిట్టక తప్పదు కనుక చనిపోయిన తర్వాత గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశానవాటికలను నిర్మించాల్సిన అవసరాన్ని చెప్పారు. ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై’అనే సుభాషితం చదివి గ్రామాల వికాసానికి మంచి సంకల్పంతో నడుం బిగించాలని ఉద్భోధించారు. 


సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్‌

నిష్ణాతులతో రిసోర్సు పర్సన్ల బందం
స్థానిక సంస్థలను పనిచేసే పరిపాలనా విభాగాలుగా తీర్చిదిద్దడం ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ప్రతినిధులకు తగిన శిక్షణ ఇచ్చేందుకు నిష్ణాతులైన రిసోర్సు పర్సన్లను ఎంపిక చేసింది. గ్రామవికాస ప్రణాళికలపై అవగాహన కలిగి, పంచాయతీరాజ్‌ సంస్థల్లో పనిచేసిన అనుభవం కలిగిన 320 మందితో రాష్ట్ర స్థాయి బందాన్ని తయారు చేసింది. పంచాయతీరాజ్‌ అధికారులు, అధ్యాపకులు, ఎన్జీవోల ప్రతినిధులు, మాజీ సర్పంచులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఈ బృందంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎమ్మెల్యేలు డీఎస్‌ రెడ్యానాయక్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్, సెర్ప్‌ సీఈవో పౌసమిబసు, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లాల పంచాయతీ అధికారులు, రిసోర్స్‌ పర్సన్లు పాల్గొన్నారు.

స్పూర్తిప్రదాతల గురించి
రిసోర్సు పర్సన్లకు అవగాహన, స్పూర్తి కలిగించే క్రమంలో సమావేశంలో గ్రామాల అభివద్ధిలో ఎంతో కషి చేసిన వ్యక్తులను, సంస్థలను, గ్రామాలను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత తొలి పంచాయతీరాజ్‌ మంత్రి ఎస్కే డే.. దేశంలో పంచాయతీరాజ్‌ ఉద్యమానికి పురుడు పోసిన విధానాన్ని ఆయన సలహాలు, సూచనల మేరకే మొదటి ప్రధాని నెహ్రూ నీటిపారుదల నిర్మాణానికి, వ్యవసాయరంగ అభివద్ధికి చర్యలు తీసుకున్న వైనాన్ని వివరించారు. నాడు ఎస్కే డే హైదరాబాద్‌లో నెలకొల్పిన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) గురించి.. ఆయన చొరవతో షాద్‌నగర్, పటాన్‌చెరువు బ్లాకులు ఏర్పడిన విషయాన్ని వివరించారు. కొంకణ్‌ ప్రాంతంలో చైతన్యం తీసుకొచ్చి ఎత్తుపల్లాలుండే భూభాగంలో వ్యవసాయం ఎలా చేయాలో చేసి చూపించిన బండార్కర్‌ గురించి వివరించారు. మహారాష్ట్రలోని వన్రాయ్‌ సొసైటీ స్వచ్ఛందంగా గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించి, చేసిన సేవను వివరించారు. కూసం రాజమౌళి కృషి కారణంగా వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి ప్రపంచానికే ఓ ఆదర్శ గ్రామంగా ఎలా తయారైందో వివరించారు. గ్రామస్తులు, మహిళల సాధికారితకు నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామం ఓ ఉదాహరణగా సీఎం చెప్పారు. ఒక్క దోమ కూడా లేకుండా పరిసరాలను ఎలా కాపాడుకోవచ్చో హైదరాబాద్‌ నగర శివారు ప్రగతి రిసార్ట్స్‌ చేసి చూపించందని చెప్పారు. ఈ సందర్భంగా గంగదేవిపల్లి సర్పంచ్‌ కూసం రాజమౌళిని వేదికపైకి పిలిపించి సీనియర్‌ అధికారులు, ఎమ్మెల్యేల సరసన కూర్చోబెట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top