పట్టు చీర చిక్కేదెలా ?

KCR Gifted Pattu Saree Missed In Temple - Sakshi

సీఎం సమర్పించిన చీర మాయంపై సందేహాలు

విచారణాధికారిగా డీఆర్‌ఓ నియామకం

ఎండోమెంట్‌ విచారణలో  నిర్లక్ష్యం

ఒక అర్చకుడికి మెమో జారీ

ఆలయంలో భద్రత కరువు

కాళేశ్వరం భూపాలపల్లి జిల్లా : స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర«శేఖర్‌రావు దంపతులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరాలయంలోని శుభానందదేవి(పార్వతీ) అమ్మవారికి సమర్పించిన పట్టుచీర మాయమైన ఘటనపై విచారణ నత్తనడకన సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2016, మే 2న సీఎం కేసీఆర్, శోభ దంపతులు కాళేశ్వరాలయంలో శుభానందదేవి అమ్మవారికి రూ.36 లక్షలతో బంగారు కిరీటం బహూకరించి, పట్టు చీరను సమర్పించి మొక్కులు చెల్లించిన విషయం తెలిసిందే. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే రోజున భూమిపూజ చేశారు.

అయితే ఆ చీర కొన్నాళ్లుగా కనిపించడం లేదు. విషయం బయటకి పొక్కడంతో సిబ్బంది చీరను మార్చి మోసం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

నాలుగు రోజులైనా..

సీఎం కేసీఆర్‌ అమ్మవారికి సమర్పించిన చీర మా యమైన విషయం నాలుగు రోజుల క్రితం వెలుగు చూసినా అధికారుల్లో చలనం రావడం లేదు. కేవలం ఆలయ ఉపప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తికి ఈఓ మారుతి మెమో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. గతంలో కాళేశ్వరాలయంలో ఈఓలుగా పనిచేసిన ఇద్దరికి కూడా తమ వివరణ ఇవ్వాలని ఎండోమెంట్‌ ఉన్నతస్థాయి అధికారులు మెమోలు జారీ చేస్తున్నట్లు తెలిసింది.

పోలీసులకు ఫిర్యాదే లేదు..

చీర మాయం విషయమై సంబంధిత ఈఓ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పోలీ సులు మాత్రం ప్రాథమికంగా విచారణ జరిపారు. సంబంధిత ఈఓ చీర మాయంపై ఫిర్యాదు చేస్తే విచారణలో వేగం పెంచి చీర చిక్కును ఛేదిస్తామని సీఐ రంజిత్‌ పేర్కొంటున్నారు.

అర్చకుడికి మెమో జారీ..

పట్టు చీర మాయంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆలయ ఉపప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తికి ఈఓ మారుతి మెమో జారీ చేశారు. గతంలో కాళేశ్వరాలయంలో ఈఓలుగా పనిచేసిన ఇద్దరికి తమ వివరణ ఇవ్వాలని ఎండోమెంట్‌ ఉన్నతస్థాయి అధికారులు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది.

చీరమార్చి మోసం!

సీఎం సమర్పించిన చీర మాయమైందని బయటకి పొక్కడంతో మరో ఇద్దరు అర్చకులు, ఓ ఉద్యోగి కలసి మరో చీరను వరంగల్‌ బట్టల దుకాణంలో కొనుగోలు చేసి ఆలయ చైర్మన్, ఈఓల ముందు ఉంచారు. ఆ చీర సీఎం సమర్పించిన చీర కాదని మరో వర్గం ఆరోపించడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో ఈవ్యవహరమంతా బట్టబయలైంది.

భద్రతపై అనుమానాలు...

ఆలయంలో సీఎం ఇచ్చిన చీరకు భద్రత లేనప్పుడు బంగారు నగలు, వెండి ఆభరణాలకు ఎలాంటి భద్రత ఉందో అర్థమవుతుంది. ప్రతే ఏటా కాళేశ్వరాలయంలో వీవీఐపీలు విలువైన పట్టు చీరలు అమ్మవారికి బహూకరిస్తారు. ఆ చీరలు కూడా ఆలయంలో కనిపించడం లేదని తెలుస్తోంది.

వాటికి సంబంధించిన రికార్డులను కూడా అధికారులు రాయడం లేదు. ఆ విలువైన చీరలు అధికారుల ఇళ్లకు తరలిపోతున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం సీసీ కెమెరాలు కూడా నాణ్యత లేవని అర్థమవుతోంది. 2 మెగా పిక్సల్‌ కెమెరాలను ఆలయంలో అమర్చినట్లు తెలిసింది.

నాకు అధికారికంగా ఆదేశాలు రాలేదు...

కాళేశ్వరాలయంలో చీరం మాయంపై విచారణాధికారిగా నన్ను నియమించలేదు. కలెక్టర్‌ మౌఖికంగా చెప్పారు. అధికారికరంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆదేశాలు ఇస్తే విచారణ ప్రారంభిస్తా.

– మోహన్‌లాల్, డీఆర్‌ఓ, భూపాలపల్లి

చీర మాయంపై ఫైలు అందింది..

కాళేశ్వరాలయంలో సీఎం అందజేసిన చీర మాయంపై సంబంధించిన ఫైలు పరిశీలిస్తున్నాం. త్వరలో చర్యలు తీసుకుంటాం. – కృష్ణవేణి, ఎండోమెంట్, విజిలెన్స్‌ అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top