వికారాబాద్‌లో 2 లక్షల మందితో సభ! 

KCR Completed the Campaign in 12 Lok Sabha Segments Till Thursday - Sakshi

చేవెళ్ల సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్‌ఎస్‌

సభ నిర్వహణపై దృష్టి సారించిన కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలుపు లక్ష్యంతో ఉన్న టీఆర్‌ఎస్‌... చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌లో చేపట్టనున్న బహి రంగ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎన్నికల ప్రచారంలోకెల్లా అత్యధిక మందితో వికారాబాద్‌లో ఈ సభను నిర్వహించాలని నిర్ణయించింది. బహిరంగ సభను 2 లక్షల మందితో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతు న్నాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు సభ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జన సమీకరణ, సభ నిర్వహణ బాధ్యతలను ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు అప్పగించారు. సికింద్రాబాద్, మల్కా జిగిరి, చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ల ఉమ్మడి ప్రచార సభను గత నెల 29న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ నిర్వహించింది.

అయితే మిర్యాలగూడలో ప్రచార సభకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ రావడంతో ఆలస్యం కావడం, ఎల్బీ స్టేడియం సభకు కేసీఆర్‌ రాలేకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు సెగ్మెంట్లలో ప్రచార సభ లు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌ బహిరంగ సభ ఈ నెల 8న వికారాబాద్‌లో జరగనుంది. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలకు, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు జనసమీకరణ బాధ్యతలను పార్టీ అప్పగించింది.

సీఎం కేసీఆర్‌ గురువారం వరకు 12 లోక్‌సభ సెగ్మెంట్లలో ప్రచారం పూర్తి చేశారు. చేవెళ్ల, ఆదిలాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి సెగ్మెంట్లలో ఆయన ప్రచారం చేయాల్సి ఉంది. చేవెళ్ల, ఆదిలాబాద్‌లో ఒకేరోజు సభ నిర్వహించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఆదిలాబాద్‌ సెగ్మెంట్‌ పరిధిలోని నిర్మల్‌లో ఈ నెల 7 లేదా 8న సభ నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. 

నేడు, రేపు సమీక్షలు... 
ఉగాది పండుగ సందర్భంగా శుక్రవారం, శనివారం ప్రచారానికి విరామం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రచార తీరు, నియోజకవర్గాలవారీగా తాజా పరిస్థితులపై ఇప్పటికే సమాచారం, సర్వేల నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్‌... ఈ రెండు రోజుల్లో వాటిపై సమీక్షించనున్నారు. అవసరమైన మేరకు ఆయా లోక్‌సభ సెగ్మెంట్ల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, అభ్యర్థులతో కేసీఆర్‌ స్వయంగా మాట్లాడనున్నారు. పోలింగ్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై వారికి స్పష్టత ఇవ్వనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top