నిరుద్యోగ భృతి లేదు

KCR Clarifies No Unemployment Benefits For Unemployed Youth In Telangana - Sakshi

ఈ ఏడాది ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు

మండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది కూడా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తామిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఐదేళ్ల సమయం ఉందని, వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతి ఏడాది చూస్తామన్నారు. ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సాధ్యం కాదన్నారు. శనివారం మండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సీఎం సమాధానమిస్తూ.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం రాష్ట్రంలో కూడా 10% ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. భైంసాలో అల్లర్లలో నిజమైన బాధితుల వివరాలు అందజేస్తే సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో 70 శాతానికి పైగా బలహీనవర్గాల వారు ఉన్నందున రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంతో పోరాడతామని, కేబినెట్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామని చెప్పారు. పీఆర్సీ కమిటీ గడువు ముగిసినా కొనసాగిస్తామని, సర్వీసు బుక్స్, ఇతర అంశాలను పూర్తిస్థాయి లో ప్రక్షాళన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వేతన సవరణ కోసం పీఆర్సీ ఆగలేదని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామన్నారు. గతం లో ఏపీ సీఎం కక్ష పూరితంగా వ్యవహరించారని, తాము మహారాష్ట్ర సీఎంతో ఏడుసార్లు భేటీఅయి ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.  సంక్షేమ రంగంలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 

ఐకేపీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
57 ఏళ్ల వయసు దాటిని వారికి వృద్ధాప్య పింఛన్లు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. నిరుద్యోగం ఉంటుందని, అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ ఉద్యోగ అవకాశాలు పొందేలా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు స్టడీసర్కిళ్ల ద్వారా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, ఐకేపీ కింద ఉన్న మూడు, నాలుగు వందల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. 

త్వరలో కోటి ఎకరాలకు నీరు..
ఏడాదిన్నర రెండేళ్లలోనే పూర్తిస్థాయిలో పాలమూరు, సీతారామ, దేవాదుల, కాళేశ్వరం పూర్తిస్థాయిలో పూర్తయితే కోటి ఎకరాలకు నీటిని అందిస్తామన్నారు. రైతు బీమా గొప్ప పథకమని, ఏ రైతు ఏ కారణంతో చనిపోయినా బీమా కల్పిస్తామని, ఈ పథకానికి ప్రీమియం మొత్తం రూ.600 కోట్ల నుంచి రూ.1,300 కోట్లకు పెరిగిందని, రైతుల సంఖ్య ఇంకా పెరిగినా ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. రైతు మరణించిన 10 రోజుల్లోగా అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. 

బతికున్నంత కాలం ఉచిత కరెంట్‌
​​​​​​కేసీఆర్‌ బతికున్నంత కాలం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తామని, రైతుబంధు, రైతుబీమా, కోటిఎకరాలకు నీరందించేలా నీటిపారుదల ప్రాజెక్టులు చేపడతామన్నారు. కల్తీలేని ఎరువులు,విత్తనాలు అందించేందుకు కఠినచర్యలు తీసుకుంటామని, కల్తీకి పాల్పడే దుర్మార్గులపై పీడీయాక్ట్‌ పెట్టి జైలుకు పంపుతామని తెలిపారు. మహిళల ఆత్మగౌరవానికి చిహ్నమైన డబుల్‌ బెడ్రూం ఇళ్లను 2.76 లక్షల మేర నిర్మాణం పూర్తిచేసి అందజేస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top