కశ్మీరీల బతుకు దుర్భరం

Kashmiri's life is bad - Sakshi

ఎన్‌యూజే జాతీయ సదస్సులో రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ యతిరాజులు

మీడియా ప్రజలకు వాస్తవాల్ని తెలియజేయాలి

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పత్రికలు ఎన్నో కుంభకోణాల్ని వెలుగులోకి తెచ్చాయని, మానవ హక్కుల్ని కాలరాసిన ఘటనల్ని ఎలుగెత్తి చాటాయని, ఇప్పుడు కశ్మీర్‌లో జరుగుతున్న ఘటనల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసే బాధ్యత వాటిపై ఎంతో ఉందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ డి.యతిరాజులు అన్నారు. ఉగ్రవాదం వేళ్లూనుకుపోయిన నేపథ్యంలో కశ్మీర్‌లో ప్రజల జీవన విధానం దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కశ్మీర్‌ సమస్యలపై అవగాహన–మీడియా పాత్ర’అనే అంశంపై నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌(ఎన్‌యూజే) ఆధ్వర్యం లో శనివారం ఇక్కడ జరిగిన జాతీయ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.

కశ్మీర్‌ సమస్యపై మీడియాతోపాటు వివిధ సంస్థలు, సంఘాలు, మేధావుల సమన్వయంతో పెద్ద ఎత్తున సదస్సులు, సమావేశాల నిర్వహించి శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి కృషి చేయాలని సూచించారు. కశ్మీరీల తలసరి నెల వ్యయం పదహారు వందల రూపాయలు మాత్రమేనని, 30 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని తెలిపారు. ఆ రాష్ట్ర ఆదా యం పూర్తిగా పర్యాటకులపై ఆధారపడిందని, ఉగ్రవాదం కారణంగా పర్యాటకుల రాక తగ్గి అది అనూహ్యంగా పడిపోయిందన్నారు.

370 అధికరణాన్ని రద్దు చేయాలని ఎన్‌యూజే అధ్యక్షుడు అశోక్‌ మాలిక్‌ డిమాండ్‌ చేశారు. మీడియా బాధ్యతగా లేకపోవడం వల్లే కశ్మీర్‌లో ఏకపక్షంగా వార్తలు వస్తున్నాయని ఎన్‌యూజే జాతీయ కార్యదర్శి సిల్వేరి శ్రీశైలం అన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ ఉప్పల లక్ష్మణ్, ఎంవీ లక్ష్మీదేవి, రాజేంద్రనాథ్, మోహన్‌ యాదవ్, రఘుపతిరెడ్డి ఇతరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top