కాళేశ్వరంతో జిల్లా సస్యశ్యామలం

Kaleshwaram Will Helps For Better Cultivation Says Minister Harish Rao - Sakshi

చిన్నకోడూరు(సిద్దిపేట) : కళాశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట జిల్లా సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర నీటి పారదుల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు నీటి లభ్యతను, సమగ్ర స్వరూపాన్ని శుక్రవారం అర్థరాత్రి వరకు మేధావులకు ఆయన వివరించారు. శుక్రవారం రాత్రి చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు, టన్నెల్, సర్జిపుల్‌ పంప్‌ హౌస్‌ల నిర్మాణాలను జిల్లా వైద్యులు, అడ్వకేట్లు, టీఎన్జీఓ బృందాల సభ్యులు పరిశీలించారు. ప్రతీ ప్యాకేజీ లెక్కను నీటి లభ్యతను ఘణాంకాలతో పాటు వివరించారు.

బీడు వారిన భూములకు గోదావరి జలాలు వరంగా మారుతాయని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం క్యాంప్‌ కార్యాలయంలో అర్థరాత్రి వరకు ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సవివరంగా వివరించారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న కాళేశ్వరం పనులు చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పనుల్లో ఏ ఏ ప్యాకేజీల్లో ఎంత మేర పనులు పూర్తయ్యాయి.. ఇంకా ఎంత మేర చేయాల్సి ఉంది.. ఆ పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి.. ఎన్ని రోజుల్లో నీళ్లు వస్తాయి.. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం ఎలా ఉంది..ఎలా నీళ్లను పైకి తీసుకువస్తున్నామనే పూర్తి వివరాలను మంత్రి వారికి సవివరంగా వివరించారు.

లైవ్‌ విజువల్స్‌ ద్వారా ఎక్కడెక్కడ ఏ ప్యాకేజీలో ఏ మేర పనులు జరుగుతున్నాయి. ఎంత శాతం పూర్తయింది. ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తవుతుందనే అంశాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆరు దశాబ్ధాలుగా తెలంగాణకు సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సందిళ్ల మీదుగా ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌ల ద్వారా నిజామాబాద్‌ జిల్లాలోని హల్దీవాగుకు నీళ్లు ప్రవహించే విధానం వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్త 36 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top