కాకతీయుల చరిత్రను భావితరాలకు తెలియజేసేలా కాకతీయ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
హన్మకొండ అర్బన్ : కాకతీయుల చరిత్రను భావితరాలకు తెలియజేసేలా కాకతీయ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మహోత్సవాలు 2015 జనవరి 9,10,11 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ రానున్నారు.
ఉత్సవాల ఏర్పాట్ల విధివిధానాలు ఖరారు చేసేందుకు శనివారం హైదరాబాద్‌లోని పర్యాటక భవన్‌లో ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో ఉత్సవాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ హరికృష్ణ, కలెక్టర్ జి.కిషన్, సమాచార శాఖ సంచాలకులు సుభాష్‌గౌడ్ హాజరయ్యారు.
పది జిల్లాల్లో నిర్వహణ
కాకతీయ మహోత్సవాల పేరిట మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో 9, 10,11 తేదీల్లో వరంగల్‌తోపాటు మిగతా తొమ్మిది జిల్లాల్లో కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తేదీలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకతీయ సామ్రాజ్యంలో అలరారిన కళాసంపదతోపాటు వారసత్వ కళలను, ప్రజాదరణ పొందిన గ్రామీణ కళలను ప్రతిభింబించేలా ఉత్సవాలు నిర్వహించలన్నారు.
ప్రధానంగా కాకతీయ పాలకుల కళాపోషణ, సాంస్కృతిక పరిరక్షణ, ప్రజారంజక పాలన తదితర అంశాలను ప్రతిబింబిచేలా ఉత్సవాలు నిర్వహించేందుకు కలెక్టర్లను సంప్రదించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన సహాయ సహకారాలు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు, వరంగల్ కలెక్టర్ అందజేస్తారని తెలిపారు. జిల్లాలో కార్యక్రమాల కోసం రాష్ట్రం నుంచి కళా బృందాలు పంపనున్నట్లు తెలిపారు. స్థానిక కళలు ప్రస్పుటించేలా కార్యక్రమాలు ఉండేలా చూడాలని అన్నారు.
ఉత్సవ శోభ ఉట్టిపడేలా..
ఉత్సవ శోభ ఉట్టిపడేలా మూడు రోజులపాటు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని పర్యాటక శాఖ అడిషన్ చీఫ్ శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా కాకతీయ వైభవం ఉట్టిపడేలా జ్ఞాపికలు రూపొందించాలని అన్నారు. జిల్లాలో నిర్వహించే ఉత్సవాల్లో కళాకారులు, మేధావులు, జిల్లాలోని ప్రముఖులతో ర్యాలీ నిర్వహించాలి. ఉత్సవాల నిర్వాహణ కోసం అందరికీ ఆమోద యోగ్యంగా ఉండే స్థలం ఎంపిక చేయాలని అన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చూడాలని సూచించారు. కాకతీయుల కళా సంపదను ప్రతిబింబించేలా కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు తయారు చేయాలని అన్నారు. ప్రాచీన క్రీడలను నిర్వహించాలని, ఉత్సవాల ప్రాంగణంలో పూర్తిగా పండగ వాతావరణం ఉండేలా చూడాలని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు.
కొత్తవారికి పింఛన్ల పంపిణీ
కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చేసే ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కళాకారుల పింఛన్‌ల కోసం అర్హులను, కొత్తవారిని ఎంపిక చేసి పంపిణీకి చర్యలు తీసుకోవాలని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య అన్నారు.
ప్రపంచానికి చాటి చెప్పేలా..
గత ఉత్సవాలను జిల్లాకు మాత్రమే పరిమితం చేశామని.. ప్రస్తు తం తెలంగాణ రాష్ట్రంలో కాకతీయుల చరిత్ర ప్రపంచానికి చాటిచెప్పేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణరుుంచిందని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. ఉత్సవాల్లో ఒకరోజు పూర్తిగా స్థానిక కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేసేలా సమాచార శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఇన్‌టాక్ ప్రతినిధులు ప్రొఫెసర్ పాండురంగారావు, అనురాధరెడ్డి, పురావస్తు శాఖ సంచాలకులు మనోహర్, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు, అధికారులు పాల్గొన్నారు.