రిజర్వేషన్లపై తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు | k laxman fires on Cm KCR | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు

Apr 17 2019 6:11 AM | Updated on Apr 17 2019 6:11 AM

k laxman fires on Cm KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గెలిస్తే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందన్న భయంతోనే సీఎం కేసీఆర్‌ ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. కేసీఆర్‌కు దేశంలో ఏక కాలంలో ఎన్నికలు జరగాలని లేదని, అలా అనుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకు ఎందుకు వెళతారని ప్రశ్నించారు. అయినప్పటికీ తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ పగటి కలలు కంటూ కేంద్రంలో మంత్రులం అవుతామని అంటున్నారని, ఫెడరల్‌ ఫ్రంట్‌ వస్తే ఇద్దరు మంత్రులే ఎందుకని, కేసీఆర్‌ ప్రధాని కావచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇదంతా మైండ్‌ గేమ్‌ మాత్రమేనని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామని ఉద్యోగులపై కేసీఆర్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ శాఖను తీసేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తప్పుల తడకగా నడుస్తోందని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల కుదింపు విషయంలో కేసీఆర్‌ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గించారని, ఇంకా తగ్గించాలని చూస్తున్నారని అన్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నా, ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.  

జెడ్పీలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలి.. 
స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదరాబాదరాగా వెళ్తున్నారని, ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్ష ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు. తొందరపాటుతో, రాజకీయ దురుద్దేశంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. జెడ్పీలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ల్యాండ్‌ మాఫియా పెరిగిపోయిందని, ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి పల్లెల్లో బెల్ట్‌ షాపులు తెరిచారని.. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం మద్యం ద్వారానే వస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రూ. వేల కోట్ల అవినీతి జరిగిందని, దానిపై విచారణ జరిపిస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు ఎందుకు జరిపించలేదని నిలదీశారు.  

బాధితులకు న్యాయం జరిగేలా చూస్తా..
నల్లగొండ, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరోసిస్‌ బాధితులు చాలా మంది ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని లక్ష్మణ్‌ హామీ ఇచ్చారు. ఫ్లోరోసిస్‌ బాధితుల తరఫున ఎన్‌ఆర్‌ఐలు జలగం సుధీర్, రమేశ్‌ దేవా, కత్తి గోపాలకృష్ణ, బోజారెడ్డి (ప్రకాశం), జి.నాగరాజు తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో లక్ష్మణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చౌటుప్పల్‌ వద్ద ఫ్లోరైడ్‌ పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేసిందని గుర్తు చేశారు. భూ సేకరణలో జాప్యం జరుగుతుండటంతో పరిశోధనా కేంద్రం ఏర్పాటు ఆలస్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు చొరవ చూపాలని కోరారు. ఫ్లోరోసిస్‌ గ్రామాలకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని లక్ష్మణ్‌ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement